సిద్ధార్థ్ రెడ్డి ఐఏఎస్.. నితిన్ మాస్ ధమ్కీ!
on Jul 26, 2022

నితిన్, కృతి శెట్టి జంటగా రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, 'రా రా రెడ్డి' సాంగ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడేలా చేశాయి. ఇక తాజాగా 'మాచర్ల ధమ్కీ' పేరుతో విడుదల చేసిన వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.
చాలా కాలం తర్వాత నితిన్ చేస్తున్న పక్కా కమర్షియల్ ఫిల్మ్ ఇది. ప్రస్తుతం యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటం 'మాచర్ల నియోజకవర్గం' చిత్రానికి కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. పైగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన 'మాచర్ల ధమ్కీ' కూడా అదే రేంజ్ లో ఉంది. ఇందులో ఐఏఎస్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో నితిన్ కనిపిస్తున్నాడు. "మహాభారతంతో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు.. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం" అంటూ నితిన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్ తో 'మాచర్ల ధమ్కీ' వీడియో ఆకట్టుకుంటోంది. అలాగే ఈ మూవీ ట్రైలర్ ను జులై 30న విడుదల చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు.

కేథరిన్ థ్రెసా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మురెళ్ళ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



