ENGLISH | TELUGU  

మౌళితో ప్రారంభమై రాజమౌళితో పతాక స్థాయికి చేరిన కీరవాణి సంగీత ప్రస్థానం!

on Jan 12, 2023

ఎం ఎం కీరవాణి.... ఈ పేరులోనే ఏదో అద్భుతం దాగి ఉందనిపిస్తోంది.  అప్పటివరకు దక్షిణాది సినీ రంగాన్ని తన సంగీతంతో ఉర్రూత‌లూగించిన  ఇళయరాజాకు దీటైన సంగీత దర్శకునిగా ఇతని పేరు చెప్పుకోవచ్చు.  కానీ మనం మాత్రం మన ఇంటి బంగారాన్ని గుర్తించలేం... పొరుగింటి పుల్లకూర రుచి అని వారి కోసం ఆరాటపడతాం. ఇక్కడ ఇళయరాజాను కించపరచడం కాదు గాని ఇళయరాజాకు ఏ విషయంలోనూ కీరవాణి తీసిపోడ‌ని కచ్చితంగా చెప్పవచ్చు. ఇతని పూర్తి పేరు కోడూరు మరకతమణి కీరవాణి. సంగీత దర్శకునిగా,  ప్లే బ్లాక్  సింగర్ గా ఇతని పేరు సుపరిచితం. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకు ఈయన సంగీతాన్నిఅందించి ఉన్నారు. తమిళంలో మరకతమణి అని బాలీవుడ్ లో ఎం ఎం క్రీమ్ అని ఈయ‌న‌ను పిలుస్తారు.

తెలుగులో ఒక సంగీత దర్శకుడు బిజిఎం బాగా ఇస్తాడని, మరో స్వ‌ర‌క‌ర్త బాగా మెలోడీలు ఇస్తాడని, మరో మ్యూజిక్ డైరెక్టర్ ఊర మాస్ సాంగ్స్ ఇస్తాడని ఇలా కేటగిరీలుగా మనం విభజించుకుంటాం. కానీ పైన చెప్పుకున్న బిజిఎం, మెలోడీ, ఫాస్ట్ బీట్, మాస్ మసాలా సాంగ్స్ ఇలా  కేట‌గ‌రీ   ఏదైనా సరే కీరవాణి అలవోకక సంగీతాన్ని అందిస్తారు. వాస్తవానికి ఆయన మొదట 1980ల  సమయంలో తెలుగు సంగీతాన్ని ఏలిన కే చక్రవర్తి వద్ద సంగీత శిష్యరికం చేశారు. ఆ సమయంలోనే కలెక్టర్ గారి అబ్బాయి, భారతంలో అర్జునుడు వంటి చిత్రాలకు ఆయన చక్రవర్తి వద్ద 1987లో పనిచేశారు. 

స్వర్గీయ సినీ పాట సాహిత్య గురువు వేటూరి నుంచి సలహాలను పొందేవారు. 1990లో ఈయన కల్కి అనే చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమా విడుదల కాలేదు. మొదటిసారిగా రామోజీరావు సంస్థ అయినా ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ నరేష్, సితార జంటగా రూపొందిన మనసు మమతా చిత్రానికి సంగీతం అందించడం ద్వారా తన మొదటి చిత్రాన్ని 1990లో ప్రారంభించారు. ఈ చిత్రానికి మౌళి ద‌ర్శ‌కులు. ఆ త‌ర్వాత సుమన్, లిజి జంటగా సునీల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆత్మబంధం అనే చిత్రంలో ఈయన అందించిన పాటలు నాడు కొంతమందికి బాగా నచ్చాయి.  

కానీ ఈయన సినీ కెరీర్ ను మ‌లుపు తిప్పిన చిత్రంగా అంటే సీతారామయ్యగారి మనవరాలు అని చెప్పాలి. క్రాంతి కుమార్ దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలోని పాటలు న‌భూతో  నా భవిష్యతి. ఈ చిత్రంలోని పాటలను నాటి తరం వారు అద్భుతం అని కొనియాడారు. ఆ తర్వాత ఆయన ఉషా కిరణ్ మూవీస్ లోనే సారి అమ్మ‌, పీపుల్స్  ఎన్‌కౌంట‌ర్‌,  అశ్విని వంటి చిత్రాలకు పని చేశారు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తాను తీసిన క్షణక్షణం చిత్రంలో కీరవాణిని ఎంచుకున్నారు.  దాంతో శివా చిత్రానికి ఇళయరాజా తో పనిచేసిన వర్మ క్షణక్షణం కు కీరవాణిని ఎంపిక చేసుకోవడంతో అప్పటికే కీరవాణి ప్రతిభను గుర్తించిన కొందరు సంగీతాభిమానులు సంతోషించారు. మరికొందరు ఇదేమిటి ఇళయరాజాని పెట్టుకోకుండా కీరవాణికి  ఛాన్స్ ఇచ్చారు.  

ఎవరి కీరవాణి అంటూ ఆ సినిమా కోసం ఎదురు చూశారు. ఆ చిత్రం కోసం ఆయన అందించిన సంగీతం యావత్ సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపింది. ఇక ఆ తర్వాత ఈయనకు ఎక్కడ లేని పేరును తీసుకువచ్చిన చిత్రం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు. ఈ చిత్రంలో మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల వైవిద్యమైన సాంగ్స్‌ను అందించి వారి చేత చిందులేయించారు. 

ఎంత ఫాస్ట్ బీట్ సాంగ్ అయినా తనలోని మెలోడీ మార్కును అందులో త‌న‌దైన మెలోడీ మార్కును ఆయ‌న మిస్ కారు. అదే  కీరవాణి గొప్పతనం. అందుకే కీరవాణి మాస్ సాంగ్స్ అండ్ ఇచ్చిన అందులో మెలోడీ మిస్ కాదు.... వాయిద్య పరికరాలు ఆయన సంగీతాన్ని డామినేట్ చేయవు. సాహిత్యంలోనే ప్రతి పదం మనకు బాగా అర్థమవుతుంది.... వినిపిస్తూనే ఉంటుంది. బంగారు కోడిపెట్ట సాంగ్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్ అంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు మరలా అదే పాటను రీమిక్స్ గా మగధీర చిత్రం కోసం వాడుకున్నారు.

కీరవాణిని తన ఆస్థాన సంగీత దర్శకునిగా మొదటి నుంచి కే రాఘవేంద్రరావు స్థానం ఇచ్చారు. ఆ తరువాత రాజ‌మౌళి, క్రిష్ తమ చిత్రాలలో కీరవాణినే ఏరి కోరి ఎంచుకుంటారు. ఈమధ్య ఇతర ఇతర దర్శకులకు పనిచేయడం త‌గ్గించారు.   ఆ మధ్య తాను సంగీతం నుంచి ఇక రిటైర్ కానున్నట్లు ప్రకటించారు. దాంతో ఆయ‌న అభిమానులు, అభిరుచి ఉన్న సంగీత ప్రియులు ఒక్కసారిగా షాక్‌కి గుర‌య్యారు.   ఇక ఈయన సంగీత ప్రయాణంలో ఒకసారి సుప్రసిద్ధ సిని గాయకుడైన కేజే ఏసుదాసుతో  ఈయనకు కాస్త విరోధం ఏర్పడిందని అంటారు. ఓ పాటను కే జే  ఏసుదాసు చేత పాడించే సమయంలో ఏసుదాస్ పాడుతున్న విధానాన్ని సంగీత దర్శకునిగా పక్కనుండి కీర‌వాణి  సరిదిద్దబోయారట. దానికి కోప‌గించుకున్న  ఏసుదాస్ ఇది సంగీతపు కాలేజీ కాదు.... ఇందులో నువ్వు లెక్చరర్ కాదు నేను స్టూడెంట్ కాదు అని అన్నారట. నాటి నుండి ఆయన కేజే ఏసుదాస్ తో  పాటలు పాడించడం మానేశారు.

కానీ ఓ చిత్రంలో సంగీత ద‌ర్శ‌కునిగా  కీర‌వాణి ప‌నిచేస్తుండ‌గా, మోహ‌న్‌బాబు ఏసుదాస్ చేత ఓ పాట పాడించ‌మ‌ని కీర‌వాణిని కోర‌గా, ఆయ‌న అయిష్టంగా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఏసుదాస్ ఎలా పాడినా నేనుసంగీత ద‌ర్శ‌కునిగా దానిని ప‌ట్టించుకోను అనే ష‌ర‌త్తుపై మోహ‌న్‌బాబు చిత్రంలో ఓ పాట‌ను ఏసుదాస్ చేత కీర‌వాణి పాడించారు. ఇక   ఒకసారి ఆయ‌న  మాట్లాడుతూ వేటూరి, సిరివెన్నెల త‌ర్వాత   తెలుగు సినీ సాహిత్యం అంప‌శ‌య్య‌పై ఉంద‌ని వ్యాఖ్యానించారు. దాంతో సిరివెన్నెల త‌ర్వాత త‌రం సినీ సంగీత సాహిత్య‌కారులు కీర‌వాణిపై మండిప‌డ్డారు. 

ఆయ‌న సాహిత్యాన్ని అందించిన పాత పాట‌ను త‌వ్వి తీసి అందులోని ద్వందార్దాల‌పై విరుచుకుప‌డ్డారు. ఇక కీర‌వాణి తాను సంగీత ద‌ర్శ‌కునిగా ప‌ని చేసిన చిత్రాల‌లో ఎక్కువ‌గా చంద్ర‌బోస్ కి అవ‌కాశం ఇచ్చారు. ఇక ఈయ‌న పాట‌లు వింటూ ఉంటే గ‌తంలో ఆ ట్యూన్స్ను ఎక్క‌డో విన్న‌ట్లు అనిపిస్తుంది అని, ఆయ‌న ట్యూన్స్‌ను  ఆయ‌నే కాపీ కొడ‌తార‌నే విమ‌ర్శ‌లు కూడా ఆయ‌న‌పై వ‌చ్చాయి. కానీ ఆయ‌న వాడే వాయిద్యాలు ఇత‌ర ర‌కాలుగా అలా అనిపిస్తోందేమో గానీ కీర‌వాణి మాత్రం తాను కాపీ క్యాట్ను కాదంటారు. ఇక జ‌గ‌ప‌తిబాబు హీరోగా జొన్న‌ల‌గ‌డ్డ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌గ‌ప‌తి అనే చిత్రానికి సంగీతం అందించారు. కానీ ఇందులోని ఓ పాట‌కు ఆయ‌న మ‌ణిర‌త్నం ద‌ళ‌ప‌తి చిత్రంలోని పాట ట్యూన్ ని మ‌క్కీకి మ‌క్కీ కాపీ కొట్టాడని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇక ఈయన తన సినీ కెరీర్లో 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులను, 11 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పలు అవార్డులు ఆయనకు సాహో అన్నాయి.  అంతేగాక ఈయన అన్నమయ్య చిత్రానికి గాను 1997లో ఉత్తమ సంగీత దర్శకునిగా నేషనల్ ఫిలిం అవార్డును సొంతం చేసుకున్నారు. వీటితోపాటు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డును ఇత‌ర ప‌లు అవార్డులను ఈయన తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా 1989లో ప్రారంభమైన ఈయన సినీ సంగీత ప్రస్థానం నేటి వరకు నిరాటంకంగా సాగుతూనే ఉంది. త‌న  సంగీత ప్రవాహంలో ఆయ‌న మనల్ని ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. ఈయన బాపు నుంచి విశ్వ‌నాథ్  వ‌ర‌కు, మౌళి నుంచి రాజ‌మౌళి వ‌ర‌కు కె. రాఘ‌వేంద్రరావు నుంచి క్రిష్ వ‌ర‌కు దాదాపు అంద‌రు ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేశారు.  

కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించడం వేరు.... ఆధ్యాత్మిక చిత్రాలకు సంగీతం అందించడం కష్టమనే నానుడిని ఈయన తప్పని నిరూపించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశా వంటి భ‌క్తిర‌స  చిత్రాలకు ఈయన అందించిన  సంగీతం మరో ఎత్త‌నే చెప్పాలి. అయితే అన్నమయ్యలో అన్నమయ్య సంకీర్తనల‌ను మ‌క్కీకి మ‌క్కీ    వాడుకుని సినిమా టైటిల్ కార్డ్స్లో మాత్రం త‌న పేరు వేసుకుని క్రెడిట్ అందుకునే ప్ర‌య‌త్నం చేశాడని కూడా నాడు ఈయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.   మాతృదేవోభవ చిత్రం కోసం ఈయన స్వ‌ర‌క‌ర్త‌గా అందించిన  రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట ఉత్తమ సినీ గేయంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాటకు వేటూరి సాహిత్యాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాట‌ను  స్వయంగా కీరవాణి ఆలపించడం విశేషం.మొత్తానికి సినీ సంగీతాన్ని స్థాయిని  వేరే లెవ‌ల్ కి తీసుకుని  పోయిన వారిలో తెలుగులో ఎం ఎం కీరవాణి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పాలి. ఈయ‌న ఆర్ఆర్ఆర్ చిత్రంలో స్వ‌ర‌ప‌రిచిన నాటు నాటు పాట ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గ‌రీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ‌ను సొంతం చేసుకుంది.  భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో ఓ పాట‌కు ఈ విధ‌మైన ప‌ట్టాభిషేకం జ‌రగ‌డం ఇదే తొలిసారి. రాబోయే కాలంగా ఇలాంటి ఎన్నో మైలురాళ్ల‌ను అదిగ‌మిస్తూ తెలుగు సినీ సంగీతాన్ని  స్థాయిని కీర‌వాణి  ఎవ‌రెస్ట్  స్థాయికి తీసుకెళ్లాల‌ని కోరుకుంటూ.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.