జనసేన సిద్దాంతాలతో శంకర్ రామ్ చరణ్‌ల సినిమా!
on Jan 12, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఆర్సి15 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో శంకర్ రాజకీయాలపై తనదైన శైలిలో సందేశం ఇవ్వబోతున్నారని సమాచారం. శంకర్ సినిమాలను తీసుకుంటే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, రోబో ఇలా ప్రతి చిత్రంలోను ఏదో ఒక సామాజిక సమస్యను ఎత్తిచూపుతూ, దానికి పరిష్కారం చూపిస్తూ, దాని పర్యవసానాలను కూడా అర్థమయ్యేలా ఆయా సినిమాలను ఆయన తెరకెక్కిస్తుంటారు. ఈసారి రామ్ చరణ్ తో చేస్తున్న చిత్రంలో ఆయన రాజకీయాలపై బలమైన సందేశం ఇవ్వనున్నారట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగుతోందని వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఒక పాత్ర అంటే పెద్ద చరణ్ పాత్ర పొలిటీషియన్ అయితే చిన్న రామ్ చరణ్ పాత్ర ఎన్నికల కమిషనర్ అని సమాచారం. పాత చరణ్ సీఎంగా, రాజకీయవేత్తగా కనిపించనున్నారు. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తాయట. 1990 నాటి కాలం పరిస్థితులను ఇందులో చూపిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఉచితాల పేరుతో, అలాగే ఓటుకు నోటు పేరుతో ఓటర్లను మభ్యపెడుతున్నాయి. దానిపై శంకర్ సందేశం ఇస్తూ మన ఓటును మనం అమ్ముకుంటున్నామంటే మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్ముకుంటున్నట్లే అనే మెసేజ్ ని ఓటర్లకు ఇవ్వనున్నాడని సమాచారం.
ఓట్లకు డబ్బులు ఇవ్వకూడదనేది జనసేన సిద్ధాంతం కూడా. దాంతో చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన సిద్ధాంతాలకు శంకర్ చూపించే పాయింట్ మరింత బాగా సూట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



