'కృష్ణమ్మ' టీజర్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్!
on Aug 4, 2022
విభిన్న చిత్రాలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సత్యదేవ్ త్వరలో 'కృష్ణమ్మ' అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపాల్ కృష్ణ దర్శకుడు. తాజాగా ఈ మూవీ టీజర్ సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది.
"ఈ కృష్ణమ్మ లాగే మేము ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో ఎవడికీ తెలీదు. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా.. పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక కథ ఉండే ఉంటది. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవ్వడూ గెలాక్కూడదు.. కానీ గెలికారు" అంటూ సత్యదేవ్ వాయిస్ తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో ఇంతకు ముందెన్నడూ కనిపించనంతగా రఫ్ లుక్ తో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు సత్యదేవ్. టీజర్ ని బట్టి చూస్తే ఇదొక క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ అక్కట్టుకునేలా ఉంది.
ఇక ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ ఉంది. 'సింహాద్రి' చిత్ర పోస్టర్స్ టీజర్ లో కనిపిస్తున్నాయి. సింహాద్రి సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గర సత్యదేవ్ ఫైట్ చేయడం టీజర్ లో చూడొచ్చు. అప్పట్లో 'సింహాద్రి' సినిమా సృష్టించిన సంచలనాలను తెలిపేలా పోస్టర్స్ ని చూపించారు. మరి ఇది 2003 లో జరిగిన కథ అని తెలపటం కోసం 'సింహాద్రి' పోస్టర్ ని చూపించారో లేక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమాలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయో తెలియాలంటే 'కృష్ణమ్మ' విడుదలయ్యే వరకు వేచి చూడాలి.
అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.