కృష్ణవంశీ.. మూడో రీమేక్ అయినా కలిసొచ్చేనా!
on Jul 4, 2022
వైవిధ్యానికి పెద్ద పీట వేసే తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ.. తన కెరీర్ లో సింహభాగం స్ట్రయిట్ పిక్చర్స్ నే తీశారు. వాటిలో చాలా చిత్రాలు దర్శకుడిగా కృష్ణవంశీ స్థాయిని పెంచాయి కూడా.
ఇక రీమేక్స్ తోనూ అడపాదడపా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ వెటరన్ కెప్టెన్. మలయాళ చిత్రం 'చంద్రలేఖ'(1997) ఆధారంగా 'చంద్రలేఖ' పేరుతోనే 1998లో కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పీకర్ ప్రధాన పాత్రల్లో ఓ రీమేక్ తెరకెక్కించిన కృష్ణ వంశీ.. ఆపై 2002లో 'శక్తి: ద పవర్' పేరుతో మరో రీమేక్ చేశారు. తెలుగులో కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'అంతః పురం'(1998)కి ఇది హిందీ వెర్షన్. అయితే, ఈ రెండు రీమేక్స్ కూడా కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి.
కట్ చేస్తే.. 20 ఏళ్ళ తరువాత ముచ్చటగా మూడో రీమేక్ తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కృష్ణవంశీ. మరాఠి చిత్రం 'నట సామ్రాట్' (2016) ఆధారంగా రూపొందుతున్న ఆ సినిమానే.. 'రంగ మార్తాండ'. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి.. మూడో రీమేక్ తోనైనా కృష్ణ వంశీ కమర్షియల్ సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
