'కార్తికేయ-2' వాయిదా పడింది
on Jul 12, 2022

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'కార్తికేయ'(2014) మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. యానిమల్ హిప్నటిజం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'కార్తికేయ-2' వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 22న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
'కార్తికేయ-2' ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఓవర్సీస్ లో కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇలాంటి టైంలో తమ సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పి షాక్ ఇచ్చాడు హీరో నిఖిల్. యూకేలో 'కార్తికేయ-2' అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని ఒక పేజ్ ట్వీట్ చేయగా.. దానికి నిఖిల్ రిప్లై ఇచ్చాడు. 'కార్తికేయ-2' జూలై 22 కి బదులుగా ఆగష్టు మొదటి వారంలో విడుదల అవుతుందని చెప్పిన నిఖిల్.. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి క్షమాపణలు తెలిపాడు. అలాగే వారికి మనీ రిఫండ్ చేస్తామని చెప్పాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి సమయం సరిపోకపోవడంతోనే రెండు వారాల పాటు సినిమా విడుదలని వాయిదా వేయాలని మూవీ టీమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ కి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



