'ఇడియట్'.. చంటి గాడి ప్రేమకథకు 20 ఏళ్ళు
on Aug 21, 2022
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఎన్ని హిట్లున్నా 'ఇడియట్' సినిమాకి ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 22, 2002 న విడుదలై ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రవితేజకు మాస్ లో, యూత్ లో భారీ ఫాలోయింగ్ ని తీసుకురావడమే కాకుండా.. స్టార్ ని చేసింది ఈ చిత్రం.
'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం'(2001) వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, పూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'ఇడియట్'. 'ఓ చంటి గాడి ప్రేమకథ' అనే క్యాప్సన్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. "సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు.. చంటిగాడు లోకల్", "కమిషనర్ కూతుళ్లకు మొగుళ్లు రారా?" అంటూ పూరి రాసిన మాటలు తూటాల్లా పేలాయి. రవితేజ తన డైలాగ్ డెలివరీ, బాడీ ల్యాంగ్వేజ్ తో చంటిగాడి పాత్రలో తనని తప్ప ఎవరిని ఊహించుకోలేనంతగా జీవించాడు. చక్రి స్వరపరిచిన పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా 'చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే' సాంగ్ అయితే ఓ ఊపు ఊపింది.
పెట్టిన పెట్టుబడికి పదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం రవితేజ కెరీర్ ని ఇడియట్ కి ముందు, ఇడియట్ తరువాత అని చెప్పుకునేలా చేసింది. సోమవారం(ఆగస్ట్ 22)తో ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు. ఇంకో 20 ఏళ్లయినా రవితేజ నటించిన టాప్ సినిమాల్లో ఇడియట్ ఖచ్చితంగా ఉంటుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
