'గోకులంలో సీత'కు పాతికేళ్ళు
on Aug 21, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రెండో సినిమా 'గోకులంలో సీత'. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 22 1997న విడుదలై ఘన విజయం సాధించింది. పవన్ కెరీర్ లో ఈ సినిమాకి ప్రత్యేక స్థానముంది. పవన్ కి ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఫిల్మ్ ఇదే. పైగా ఇది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు విడుదల కావడం విశేషం.
తమిళ చిత్రం 'గోకులత్తిల్ సీతయ్'కు రీమేక్ గా తెరకెక్కిన 'గోకులంలో సీత'ను తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా మలిచారు ముత్యాల సుబ్బయ్య. 1997 జనవరిలో 'హిట్లర్' రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించిన ఆయన.. అదే ఏడాది ఆగస్ట్ లో పవన్ కి భారీ విజయాన్ని అందించారు. తండ్రి గారాబం, నిర్లక్ష్యంతో విలాసాలకు అలవాటు పడి.. యువతి ప్రేమతో ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్న యువకుడి పాత్రలో పవన్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పవన్, హీరోయిన్ రాశి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి.
బి.శ్రీనివాస రాజు నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. 'గోకుల కృష్ణ గోపాల కృష్ణ', 'ప్రేమా ప్రేమా', 'మనసున్న కనులుంటే' వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి. పోసాని కృష్ణ మురళి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ఈ సినిమాలో కోట శ్రీనివాస రావు, మల్లికార్జున రావు, హరీష్, బ్రహ్మానందం, సుధాకర్, అచ్యుత్, శ్రీహరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



