'గాడ్సే' ట్రైలర్.. అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి
on Jun 9, 2022

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, డైరెక్టర్ గోపి గణేష్ కాంబినేషన్ లో వచ్చిన 'బ్లఫ్ మాస్టర్'(2018) సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తోంది. అదే 'గాడ్సే'. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
'గాడ్సే' ట్రైలర్ చూస్తుంటే 'బ్లఫ్ మాస్టర్' మాదిరిగానే సత్యదేవ్ వన్ మ్యాన్ షో చూపించనున్నాడనిపిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా సత్యదేవ్ పలికిన పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "సత్యమేవ జయతే అంటారు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. కానీ సమాజంలో సత్యం, ధర్మ ఎప్పుడూ స్వయంగా గెలవట్లేదు" అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. అవినీతిలో కూరుకుపోయిన రాజకీయ వ్యవస్థపై ఓ యువకుడు సాగించే పోరాటమే 'గాడ్సే' చిత్రమని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. "అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్ధతి ఉన్నోడే పార్లమెంట్ లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి. సభ్యత ఉన్నోడే సర్పంచ్ కావాలి" అనే డైలాగ్ అయితే ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. అలాగే "ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు" అంటూ లెనిన్ చెప్పిన మాటను ట్రైలర్ లో సత్యదేవ్ పలికాడు. చూస్తుంటే సత్యదేవ్-గోపి గణేష్ కాంబో మరోసారి మ్యాజిక్ చేసేలా ఉంది.
సీకే స్క్రీన్స్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి, జియా శర్మ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నాగబాబు తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. శాండీ అద్దంకి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా సురేష్ సారంగం, ఎడిటర్ గా సాగర్ ఉండగండ్ల వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



