రూ.57 కోట్లకు 'గాడ్ ఫాదర్' ఓటీటీ రైట్స్!
on Sep 20, 2022

మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం 'ఆచార్య' ప్లాప్ కావడంతో ఆయన తదుపరి సినిమా బిజినెస్ పై తీవ్ర ప్రభావం పడిందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వాస్తవం లేదని, ఆయన చేసింది రీమేక్ సినిమానే అయినప్పటికీ ఓటీటీ రైట్స్ రూపంలోనే కోట్లకు కోట్లు డబ్బులు వస్తున్నాయని అంటున్నారు.
చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్'కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.57 కోట్లకు దక్కించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. తెలుగు, హిందీకి కలిపి ఈ భారీ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి స్టార్‌డమ్ కి, సల్మాన్ స్పెషల్ రోల్ తోడవ్వడంతో 'గాడ్ ఫాదర్'కి నెట్ ఫ్లిక్స్ అన్ని కోట్లు చెల్లించడానికి సిద్ధమైందని సమాచారం. థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసే అవకాశముంది.
సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది 'ఆచార్య'తో తీవ్రంగా నిరాశపరిచిన మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'తో లెక్క సరి చేస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



