ENGLISH | TELUGU  

ఘాటి మూవీ రివ్యూ 

on Sep 5, 2025

 

తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు తదితరులు 
సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్‌
డీఓపీ: మనోజ్‌రెడ్డి కాటసాని
ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి
ఆర్ట్: తోట తరణి
యాక్షన్: రామ్-లక్ష్మణ్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథ: చింతకింది శ్రీనివాసరావు
రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
బ్యానర్స్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ: సెప్టెంబర్ 5, 2025

 

వేదం తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఘాటి. కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించిన అనుష్క.. భాగమతి తర్వాత చేసిన పవర్ ఫుల్ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ఇది. మరోవైపు ప్రతిభగల దర్శకుడిగా పేరుపొందిన క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాక్సాఫీస్ సక్సెస్ చూడలేదు. అలాంటి క్రిష్, కాస్త గ్యాప్ తర్వాత ఘాటితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇద్దరికీ సాలిడ్ హిట్ ఇచ్చేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Ghaati Movie Review)

 

కథ:
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లోని తూర్పు కనుమలలో గంజాయి సాగు యథేచ్ఛగా జరుగుతుంది. ఆ గంజాయిని దేశవిదేశాలకు తరలించి డబ్బు సంపాదిస్తుంటారు నాయుడు బ్రదర్స్(రవీంద్ర విజయ్, చైతన్య రావు). ముఖ్యంగా శీలావతి అనే రకం గంజాయిని సాగు చేయాలన్నా, అమ్మాలన్నా వారి కనుసైగల్లోనే జరగాలి. లేదంటే ఎంతటి వారైనా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. అదే ప్రాంతంలో శీలావతి(అనుష్క శెట్టి), ఆమె బావ దేశీరాజు(విక్రమ్ ప్రభు) ఉంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. ఒకప్పుడు వీరిద్దరూ కూడా కొండల్లో సాగు చేసే గంజాయిని బయటకు తరలించే ఘాటీలుగా పనిచేసినవారే. కానీ ఆ పని వదిలేసి సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. ఇదిలా ఉండగా, నాయుడు బ్రదర్స్ కి తెలియకుండా సీక్రెట్ గా శీలావతి అనే గంజాయి లిక్విడ్ రూపంలో ట్రాన్స్ పోర్ట్ అవుతుంటుంది. దీని వెనుక ఎవరున్నారో పట్టుకోవడం కోసం పోలీసులు, నాయుడు బ్రదర్స్ వేట మొదలుపెడతారు. అసలు ఆ లిక్విడ్ గంజాయికి శీలావతి(అనుష్క శెట్టి), దేశీరాజు(విక్రమ్ ప్రభు)లకు సంబంధం ఏంటి? నాయుడు బ్రదర్స్ తో తలపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు శీలావతి-దేశీరాజు లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని వారు చేరుకున్నారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

విశ్లేషణ:
బయట ప్రపంచానికి పెద్దగా సంబంధాలు లేని ప్రాంతంలో.. ఇల్లీగల్ పనులు చేస్తూ, పేద కూలీల బతుకులతో ఆడుకుంటూ.. విలన్ కోట్లు సంపాదిస్తుంటాడు. ఆ విలన్ ని అంతం చేసి, ఆ కూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఒకరొస్తారు. ఈమధ్య కాలంలో ఇలాంటి కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఘాటి కూడా అలాంటి సినిమానే.

టాలీవుడ్ లో ఉన్న ప్రతిభగల దర్శకులలో క్రిష్ ఒకరు. క్రిష్ సినిమా అంటే వైవిధ్యమైన కథ, బలమైన భావోద్వేగాలను ప్రేక్షకులు ఆశిస్తారు. ఘాటి టైటిల్ విన్నప్పుడు, ప్రచార చిత్రాలు చూసినప్పుడు.. క్రిష్ మరో కొత్త కథ చెప్పబోతున్నారని అందరూ భావించారు. తూర్పు కనుమలలోని ఘాటీల గురించి చెప్పాలన్న ఆలోచన బాగుంది.. కానీ, దానికి తగ్గ బలమైన కథాకథనాలు తోడు కాలేదు. పైగా ఈసారి క్రిష్.. ఎమోషన్స్ కంటే యాక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపించింది.

తూర్పు కనుమలలోని గంజాయి సాగుని, నాయుడు బ్రదర్స్ ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత బస్సు కండక్టర్ గా శీలావతి, ల్యాబ్ టెక్నీషియన్ గా దేశీరాజు పాత్రలను పరిచయం చేశారు. దీంతో అసలు వాళ్ళకి, గంజాయి మాఫియాకి సంబంధం ఏంటనే ఆసక్తి కలుగుతుంది. కానీ, ఆ ఆసక్తిని పెంచే ఆకట్టుకునే రచన తోడు కాలేదు. ముఖ్యంగా ప్రారంభ సన్నివేశాలు అంత ప్రభావవంతంగా లేవనే చెప్పాలి. రైల్వే స్టేషన్ లో గంజాయి డీల్ కి సంబంధించిన డబ్బుల సీన్ తోనే కథలో కాస్త ఊపు వస్తుంది. ఆ సీన్ ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడమే కాకుండా.. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఆ టెంపో కూడా తర్వాత మెయింటైన్ కాలేదు. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సర్ ప్రైస్ చేసింది. అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ అలాంటి సీన్ కి ఒప్పుకోవడం అభినందించదగ్గ విషయమే.

ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కథనం కాస్త పరుగులు పెడుతుంది. కానీ, అది కూడా సినిమాని నిలబెట్టలేకపోయింది. ప్రేక్షకులను థ్రిల్ చేసే యాక్షన్ సీన్స్ ని బాగా డిజైన్ చేసుకున్నారు కానీ, ప్రేక్షకులను కథతో కనెక్ట్ చేసే బలమైన ఎమోషనల్ సీన్స్ ని రాసుకోలేకపోయారు. అదే ఈ సినిమాకి మైనస్ అయింది. సెకండాఫ్ లో అనుష్క రౌద్ర రూపం మాత్రం అభిమానులకు కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
అనుష్క నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. శీలావతి పాత్రలో నట విశ్వరూపం చూపించింది. యాక్షన్ సీన్స్ లో రౌద్ర రసాన్ని ఎంత గొప్పగా పలికించిందో.. ఎమోషనల్ సీన్స్ లో కరుణ రసాన్ని అంతే గొప్పగా పలికించింది. దేశీ రాజుగా విక్రమ్ ప్రభు కూడా గొప్ప నటనను కనబరిచాడు. అనుష్క, విక్రమ్ ప్రభు మధ్య కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. ఇటీవల మయసభ సిరీస్ లో రెడ్డి పాత్రలో ఆకట్టుకున్న చైతన్య రావు, ఇందులో కుందుల్ నాయుడు పాత్రలో మరోసారి సర్ ప్రైజ్ చేశాడు. జగపతి బాబు ఎప్పటిలాగే తనదైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ తో మ్యాజిక్ చేశాడు.

ఘాటి మూవీ సాంకేతికంగా బాగానే ఉంది. పాటలతో పెద్దగా మెప్పించలేకపోయిన నాగవెల్లి విద్యాసాగర్‌.. నేపథ్య సంగీతంతో ఓకే అనిపించుకున్నాడు. తోట తరణి ఆర్ట్ వర్క్, మనోజ్‌రెడ్డి కాటసాని కెమెరా పనితనం ప్రేక్షకులను ఘాటి ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. ముఖ్యంగా తూర్పు కనుమల అందాలను మనోజ్‌రెడ్డి తన కెమెరాలో చక్కగా బంధించారు. ఫైట్ సీన్స్ ని రామ్-లక్ష్మణ్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

ఫైనల్ గా...
రచనలో క్రిష్ మార్క్ పూర్తిగా కనిపించనప్పటికీ.. అనుష్క అభిమానులకు, యాక్షన్ ప్రియులకు ఘాటి సినిమా కొంతవరకు నచ్చే అవకాశాలున్నాయి.

 

రేటింగ్: 2.5/5

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.