'ప్రాజెక్ట్ కె' ఎక్స్‌క్లూజివ్ అప్డేట్.. టైటిల్, రిలీజ్ డేట్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్!
on Dec 27, 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ప్రాజెక్ట్ కె'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగి పోవడం గ్యారెంటీ అని మూవీ టీమ్ నమ్ముతోంది.
నిజానికి 'ప్రాజెక్ట్ కె' అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ మూవీ అసలు టైటిల్ ని ఫిబ్రవరి లేదా మార్చిలో రివీల్ చేయనున్నారు. ఫస్ట్ లుక్ కూడా అదే సమయంలో రానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ సుమారుగా 70 శాతం పూర్తయింది. ఓ వైపు చిత్రీకరణ జరుగుతుండగా.. అదే సమయంలో మరోవైపు వీఎఫ్ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో ఎమోషనల్ సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయట. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'తో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఎలా పేరు తెచ్చుకున్నాడో.. అలాగే 'ప్రాజెక్ట్ కె'తో నాగ్ అశ్విన్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది.
'ప్రాజెక్ట్ కె'కి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట మిక్కీ జె. మేయర్ ని తీసుకున్నారు. 'మహానటి' సహా ఎన్నో సినిమాలకు సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. 'ప్రాజెక్ట్ కె' వంటి భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి ఆయన ఎంతవరకు న్యాయం చేయగలడన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మేకర్స్ సైతం ఏవో కారణాల వల్ల ఆయన స్థానంలో సంగీత దర్శకుడిగా కోలీవుడ్ కి చెందిన సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారు. తమిళ్ లో 'కబాలి', 'కాలా' వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. వెంకటేష్ హీరోగా నటించిన 'గురు' సినిమాకి కూడా ఆయనే సంగీతం అందించడం విశేషం. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న 'దసరా'కు సైతం సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'ధూం దాం దోస్తాన్' సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి 'ప్రాజెక్ట్ కె'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



