'సార్' టీజర్.. విద్యను ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి!
on Jul 28, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం 'సార్'(తమిళ్ లో 'వాతి'). తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
నేడు(జులై 28) ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా 'సార్' టీజర్ ను విడుదల చేశారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాకి రూపొందిస్తున్నట్లు టీజర్ ని బట్టి తెలుస్తోంది. 1990 లలో జరిగే కథ ఇది. విద్యని వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్న వారిపై హీరో పోరాడినట్లుగా టీజర్ లో చూపించారు. ఒక ప్రైవేట్ కాలేజ్ లో సాధారణ జూనియర్ లెక్చరర్ గా పనిచేసే హీరో.. వారిని ఎలా ఢీ కొట్టాడు అనేది ఆసక్తికరంగా ఉంది. "విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి, ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లాగా అమ్మకండి" అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ధనుష్ సొంతంగా డబ్బింగ్ చెబుతుండటం విశేషం. టీజర్ లో 90ల నాటి రోజులను గుర్తు చేసేలా రియలిస్టిక్ గా ఉన్న విజువల్స్, జీవీ ప్రకాష్ మ్యూజిక్, ధనుష్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సాయి కుమార్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



