మెగాస్టార్ పవర్ ఫుల్ పొలిటికల్ వార్నింగ్.. క్రెడిట్ ఆయనదే!
on Sep 29, 2022

"నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు" అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఈ డైలాగ్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' లోనిది. మోహన్ రాజా దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి లక్ష్మీభూపాల్ సంభాషణలు అందించారు. ఆయన ఈ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ అందించాడంటూ తాజాగా చిరంజీవి ప్రశంసించారు.
'చందమామ', 'అలా మొదలైంది', 'నేనే రాజు నేనే మంత్రి', 'ఓ బేబీ' వంటి సినిమాలతో డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీభూపాల్. ముఖ్యంగా పొలిటికల్ ఫిల్మ్ అయిన 'నేనే రాజు నేనే మంత్రి'లో ఆయన రాసిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అది చూసే ఆయనకు మరో పొలిటికల్ ఫిల్మ్ 'గాడ్ ఫాదర్'కి డైలాగ్స్ రాసే అవకాశం లభించిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎలాగైతేనే ఆయనకు వచ్చిన ఈ భారీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నట్టున్నారు. తాజాగా లక్ష్మీభూపాల్ గురించి చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.

"గాడ్ ఫాదర్ చిత్రానికి పవర్ ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్ కి నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మరెంతో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను" అంటూ ట్వీట్ చేసిన చిరంజీవి.. గాడ్ ఫాదర్ లో లక్ష్మీభూపాల్ రచించిన ఒక పవర్ ఫుల్ డైలాగ్ ని పంచుకున్నారు. "ఇన్నాళ్లు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము అడ్డంగా తిని బలిసి కొట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్లూ. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్ట్ నేను తీసుకుంటున్నా. ఇందులో ఒకటే రూల్.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం.. తప్పు చేయాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది" అంటూ అవినీతి రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఈ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



