చీకటి రాజ్యం రివ్యూ
on Nov 20, 2015
.jpg)
కమల్ హాసన్ సినిమా అంటే ఏదో సమ్‌థింగ్ స్పెషల్ అయ్యుంటుందని జనాల నమ్మకం. కమల్ కూడా వినూత్న ప్రయత్నాలతో, ప్రయోగాలతో ఆ అంచనాల్ని అందుకొంటూనే ఉన్నాడు. కమల్ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అయినా అవ్వకపోయినా, క్రిటిక్స్ పరంగా... మార్కులు దక్కించుకొంటూనే ఉంటాయి. హాలీవుడ్ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉన్న కమల్.. ఈసారి ఓ ఫ్రెంచ్ సినిమాపై మనసు పడ్డాడు. కమల్ ఓ ఫ్రెంచ్ సినిమాని అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నాడంటే.. కథలో ఎంతో దమ్ముందని, అదేదో.. బ్రహ్మాండం బద్దలయ్యే సినిమా అని భావించడంలో తప్పు కాదు. అందుకే చీకటి రాజ్యంపై కూడా చాలా అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని కమల్ ఎంత వరకూ అందుకొన్నాడు? ఈ చీకటి రాజ్యం కథేంటి? చూద్దాం.. రండి.
దివాకర్ (కమల్‌హాసన్) నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీస్ ఆఫీసర్. భార్య (ఆశా)తో తెగదెంపులు చేసుకొని దూరంగా ఉంటుంటాడు. తన కొడుకు వాసు అంటే చాలా ఇష్టం. ఓ స్మగ్లర్‌పై ఎటాక్ చేసి, కోట్ల విలువ చేసే కొకైన్‌ని స్వాధీనం చేసుకొంటాడు దివాకర్. అది.. విఠల్‌రావు (ప్రకాష్‌రాజ్) సొత్తు. దాంతో వాసును విఠల్ కిడ్నాప్ చేస్తాడు. ఆ హెరాయిన్ అప్పగిస్తేనే వాసుని వదులుతా అని షరతు పెడతాడు. తన కొడుకు కోసం హెరాయిన్ ఉన్న బ్యాగ్ తీసుకొని విఠల్ ఉన్న పబ్బుకి వెళ్తాడు దివాకర్. కానీ అనూహ్యంగా ఆ బ్యాగ్ మాయం అవుతుంది. ఆ బ్యాగ్ ఎవరు తీసుకెళ్లారు. తన కొడుకుని దివాకర్ కాపాడుకొన్నాడా లేదా? అసలు ఈ బ్యాగ్ కోసం ప్రయత్నిస్తున్న మరో ముఠా ఎవరు? ఆ ముఠాకీ.. మల్లిక (త్రిష)కు ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే చీకటి రాజ్యం చూడాలి.
క్రైమ్ కామెడీ గోలలు ఈమధ్య బాగా ఎక్కువైపోయాయి. ఓ విలువైన వస్తువు కోసం కొన్ని ముఠాలు ప్రయత్నించడం, అది హీరో చేతికి చిక్కడం.. చివరికి చేతులు మారుతూ ఉండడం.. ఇవే కథలు. అయితే వాటికి ఓ ప్రొఫెషనల్ లుక్ ఇస్తూ.. ఎక్కడా కామెడీ చేయకుండా.. కేవలం పాయింట్ పట్టుకొనే రెండు గంటల పాటు ప్రయాణం చేశాడు కమల్ హాసన్. ఒక విధంగా క్రైమ్ సినిమాల్లో ఉన్న కొత్త డెమెన్షన్ ఇందులో కనిపిస్తుంది. ఓ రాత్రి జరిగిన కథ ఇది. లొకేషన్లు కూడా మారవు. ఓ పబ్బు చుట్టూ నడుస్తుంటుంది. ఏడెనిమిది పాత్రలంతే. బడ్జెట్ పరంగా.. కమల్ చాలా తెలివిగా ఆలోచించి, తక్కువలో అయిపోయే ఓ కథని పట్టుకొని, రెండు భాషల్లో తీసి తనలోని నిర్మాతని సంతృప్తిపరచుకొన్నాడు. కాకపోతే.. కమల్ చేయాల్సిన పాయింట్, అతన్నుంచి మాత్రమే ఊహించే సబ్జెక్ట్ మాత్రం ఇది కాదనే చెప్పాలి. అసలు ఈ సినిమా ద్వారా కమల్ ఏం చెప్పదలచుకొన్నాడో ఒక్క క్షణం కూడా అర్థం కాదు. స్మగ్లర్‌లను పట్టుకోవాల్సిన వాళ్లే స్మగ్లర్లుగా ఆలోచిస్తే.. అన్నది కొత్త పాయింటే కావొచ్చు. కానీ.. దాన్నీ మామూలు క్రైమ్ స్టోరీలా నడుపుతూ, ఓ పబ్‌కే పరిమితం చేశాడు.
ఫస్టాఫ్ చాలా చక చక సాగుతుంది. ఎక్కడా సోది పెట్టకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయాడు కమల్. స్మగ్లర్ దగ్గర్నుంచి హెరాయిన్ కొట్టేయడం, ఇన్వస్టిగేషన్, ఆ తరవాత కొడుకుని వెదుక్కొంటూ పబ్‌కి వెళ్లడం, అక్కడ బ్యాగ్ పోగొట్టుకోవడం.. ఇవన్నీ చాలా ఆసక్తిగా సాగుతాయి. ఇంట్రవెల్ వరకూ బోర్ కొట్టించకుండా కథని నడిపాడు. ఆ తరవాత మాత్రం కమల్‌లోని స్ర్కీన్ ప్లే రచయిత కూడా చేతులెత్తేస్తాడు. ఎంతసేపూ ఆ పబ్బు, ఆ గదీ, ఈ గదీ వెతుక్కోవడం.. ఇదే తంతు. క్లైమాక్స్ వరకూ ఏం చేయాలో కమల్‌కీ పాలుపోక అక్కడక్కడే కథ నడిపాడు. చివరి 5 నిమిషాలూ... మళ్లీ ఊపిరి పోసే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే కథ బోర్ కొట్టేస్తుంది. కథలో ఊహించని మలుపులు లేకపోవడం.. సామాన్య ప్రేక్షకుడి అంచనాల మేరే కథ సాగడం, రొటీన్ ముగింపు ఇవన్నీ విసుగు తెప్పిస్తాయి. ఓ కథని బాగా ఎత్తుకొని.. చప్పగా వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది.
కమల్ నటుడ్ని మరో కోణంలో చూపించదగిన కథేం కాదు. దివాకర్ పాత్ర కమల్‌కి నల్లేరు పై నడకే. కమల్ లోని నటుడ్ని చూసే అవకాశం అక్కడక్కడ మాత్రమే వచ్చింది. త్రిష ని హీరోయిన్ అనేదాని కన్నా ఓ పాత్ర అనుకోవడం మేలు. త్రిష కంటే. మధుశాలినినే ప్రేక్షకులు ఎక్కువ గుర్తుపెట్టుకొంటారేమో..? ప్రకాష్ రాజ్ నటన మాత్రం మెప్పిస్తుంది. సంపత్ కూడా ఓకే. అంతకు మించి గొప్ప పాత్రలూ, గుర్తించుకోదగిన క్యారెక్టరైజేషన్లూ ఈ సినిమాలో లేవు.
నటుడిగా కంటే స్ర్కీన్ ప్లే రైటర్‌గానే కమల్ కి ఎక్కువ మార్కులు పడతాయి. అదీ.. ఫస్టాఫ్ వరకూ మాత్రమే. జాబ్రాన్ నేపథ్య సంగీతం హాలీవుడ్ రేంజులోనే సాగింది. దర్శకుడిగా రాజేష్ తొలి సినిమాతోనే తన మార్క్ వేయడంలో విఫలమయ్యాడు. ఈ మాత్రం కథకి ఫ్రెంచ్ నుంచి రీమేక్ చేయాల్సిన అవసరం ఏమిటో కమల్‌కే తెలియాలి.
కమల్ గత చిత్రం ఉత్తమ విలన్ ఫ్లాప్ అయ్యింది. డబ్బులు రాలేదు. అయితే.. కమల్ వర్క్‌కి మాత్రం ప్రసంశలు దక్కాయి. ఈ సినిమాకి అటుడబ్బులూ, ఇటు ప్రసంశలూ రెండూ కష్టమే.
రేటింగ్: 2.75/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



