కుమారి 21 ఎఫ్ రివ్యూ
on Nov 20, 2015
.jpg)
చూపించాల్సిందంతా చూపించేసి -
`బ్బాబ్బాబూ... ఇంత వరకూ మీరు చూసిందంతా తప్పు.. అలా ఉండకూడదు..` అని చివరి రీలులో జ్ఞానోదయం చేసే సినిమాలు ఇది వరకు చాలా వచ్చాయి. అంటే 13 రీళ్ల బూతు.. చివర్లో ఒకరీలు నీతన్నమాట.
ఇలాంటి సినిమాల్ని జనం ఎంత తిట్టుకొన్నా... యూత్ థియేటర్లకు వెళ్లి కనకవర్షం కురిపించుకొన్నాయి.
అలా యూత్‌ని టార్గెట్ చేస్తూ.. సుకుమార్ చేసిన ప్రయత్నం 'కుమారి 21 ఎఫ్'.
సుకుమార్ కాబట్టి బూతుని నీట్ గా ప్యాక్ చేసి 'మెచ్యూరిటీ' అనే ముసుగు వేసి అందించే ప్రయత్నం చేశాడు.
కాకపోతే యూత్‌లో 'చెడు' చూపించే ముద్ర.. చివర్లో చెప్పే రెండు ముక్కల 'మంచి' వేయదు. కాబట్టి... ఇదో టైపు సినిమాలే అని సర్దుకుపోవడమే. మరింతకీ ఈ కుమారిలో ఏముంది? యూత్ ఎక్కడ పడిపోతుంది? పెద్దవాళ్లు ఎక్కడ తలొంచుకొంటారు? చూద్దాం.. రండి.
సిద్దూ (రాజ్‌తరుణ్) కి మూడు బలహీనతలు. సిగరెట్, మందు, ఫ్రెండ్స్. ఆ తరవాత అతని జీవితంలోకి మరో బలహీనతగా కుమారి (హెబ్బా పటేల్) వస్తుంది. కుమారి చాలా ఫాస్ట్. ఓ మోడల్‌గా పనిచేస్తుంటుంది. సిద్దూని టీజ్ చేస్తుంటుంది. కుమారి దూకుడు.. సిద్దూకి నచ్చినా ఓ అనుమానం వెంటాడుతుంది. అదే.. కుమారితో పరిచయమున్న అబ్బాయిల్లో తన నెంబరెంత? అని. ఈ చనువు, ప్రేమ, ముద్దులు.. తనపైనేనా? లేదంటే అందరితోనూ ఇలానే ప్రవర్తిస్తుందా? అనే అనుమానం మొదలవుతుంది. అది.. పెరిగి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. దానికి తోడు స్నేహితులు కూడా కుమారి 'వర్జిన్' కాదు అంటుంటారు. తన ప్రియురాలు కన్యో కాదో తెలుసుకొనే పని స్నేహితులకు అప్పగిస్తాడు సిద్దూ. 'నేను కన్య కాదు. నన్ను ప్రేమించే మెచ్యూరిటీ నీకు లేదు' అంటూ బాంబు పేలుస్తుంది కుమారి. మరి ఆ మాటల్లో నిజమెంత? కుమారి వెనుక ఉన్న కథేంటి? సిద్దూ అనుమానాలన్నీ ఎలా పటాపంచలయ్యాయి? అనేదే కుమారి 21 ఎఫ్ కథ.
34, 36 .. అంటూ అమ్మాయి కొలతలు చెప్పేస్తుంటుంది.
అబ్బాయితో కలసి మందుకొడుతుంది.
తాను ప్రేమించిన అబ్బాయి మరో అమ్మాయి `వల`లో పడితే.. కండోమ్ ప్యాకెట్ చేతిలో పెట్టి సాగనంపుతుంది.
ఇదంతా మెచ్యూరిటీ అనుకోమంటాడు దర్శకుడు. ఇంత మెచ్యూరిటీ తట్టుకోవలంటే ప్రేక్షకులకు ఇంకా చాలా చాలా మెచ్యూరిటీ ఉండాలి. అమ్మాయి క్యారెక్టర్‌ని బోల్డ్‌గా చూపించాలంటే... మందుకొట్టాల్సిందేనా, సిగరెట్ పట్టాల్సిందేనా, కొలతలు చెప్పాల్పిందేనా? సుకుమార్ ఏమిటయ్యా ఇదీ అని అడగాలనిపిస్తుంది. ప్రేమంటే నమ్మకం.. ఆ నమ్మకంలేని చోట ప్రేమ నిలవదు. చూసిందంతా నిజంకాదు. నమ్మింది మాత్రమే నిజమైపోదు. ఈ పాయింట్‌ని చెప్పాలనుకొన్నాడు సుకుమార్. దాన్ని ఓ ప్రేమకథని నేపథ్యంగా తీసుకొన్నాడు. మెచ్యూరిటీ పేరుతో బోల్డ్‌గా ఉన్న ఓ అమ్మాయి పాత్రని సృష్టించాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో సుకుమార్ ఏం చెప్పదలచుకొన్నాడో అది చెప్పేశాడు.
ఈ సినిమాకి బలం.. కుమారి పాత్ర చిత్రీకరణ.
అదే బలహీనతన కూడా.
కుమారి భావాల్ని, ఆమె అంతరంగాన్నీ అర్థం చేసుకొంటే.. కుమారి 21 ఎఫ్ బాగా ఎక్కేస్తుంది. ఇదేం క్యారెక్టరైజేషన్ రా బాబూ.. అనుకొంటే మొదటి సీన్ నుంచే ఇకారం పుట్టేస్తుంది. ఇంత సెన్సిబుల్ పాయింట్‌ని పట్టుకొని ఓ సినిమాగా తీయాలని సుకుమార్‌కి ఎందుకు అనిపించిందో. బహుశా.. కుర్రాళ్లయినా ఈ సినిమా చూస్తారన్న నమ్మకం కావొచ్చు. తన టార్గెట్ కేవలం యూత్ ఆడియన్సే అయ్యిండొచ్చు. సుకుమార్ కేవలం యూత్‌ని మాత్రమే టార్గెట్ చేస్తే.. ఆ లక్ష్యాన్ని రీచ్ అయిపోయాడు. కానీ సినిమా అంటే యూత్‌కి మాత్రమే కాదు కదా..? ఓ కాలేజీ కుర్రాడు తన అక్కతోనో అమ్మతోనో ఈ సినిమా చూస్తే పరిస్థితేంటి? కండోమ్ ప్యాకెట్లు, హెల్మెట్లూ, హాల్స్.. ఈ సీన్లన్నీ చూస్తే.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రక్తం తో తడిసిన చీరను హీరో ఉతుకుతుంటే... ఇలాంటి సీన్లు భరించగలరా? పతాక సన్నివేశాల్లో మాత్రం తమిళ నేటివిటీ కనిపిస్తుంది. తమిళ దర్శకులు మాత్రమే ఇలా ఆలోచిస్తారు కదా అనిపిస్తుంది. అంత బోల్డ్‌గా ఆ సీన్స్ తీశాడు. టోటల్‌గా యూత్‌ని పడేసేలా సినిమా తీస్తూ.. ఓ సందేశం చెప్పి ఇంటికి పంపాడు.
రాజ్ తరుణ్ ఇది వరకు చేసిన రెండు సినిమాలూ.. ఎనర్జిటిక్ పెర్‌ఫార్మ్సెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. తొలిసారి అండర్ ప్లే చేయాల్సివచ్చింది. అందులోనూ బాగానే రక్తికట్టించాడు. హెబ్బాకి చాలామంచి పాత్ర దక్కింది. చాలా సన్నివేశాల్లో అందంగా కనిపించింది. తన నటన ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. మళ్లీ ఈ స్థాయి పాత్ర హెబ్బాకి పడుతుందో లేదో? హేమని ముసలి పాత్రలో చూళ్లేం. హీరో స్నేహితులుగా నటించినవాళ్లంతా తమ తమ పాత్రల్లో బాగానే ఇమిడిపోయారు. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంది. రత్నవేలు కెమెరాపనితనం, దేవిశ్రీ సంగీతం ప్రధాన ఆకర్షణ. దేవి తన ఆర్.ఆర్‌తో పతాక సన్నివేశాల్ని మరింత ఎలివేట్ చేశాడు. సుకుమార్ స్థాయి మేజిక్ సీన్లు ఈ సినిమాలో బాగానే కనిపిస్తాయి. రచయితగా సుక్కు.. యూత్‌ని ఆకట్టుకొంటాడు. దర్శకుడిగా ప్రతాప్.. చేసిందేంటంటే, సుక్కు కథని అనుకొన్నది అనుకొన్నట్టు తెరకెక్కించడమే.
యూత్ దగ్గర ఈజీగా సెల్ అయిపోయే ఓ పాయింట్‌ని పట్టుకొని ఓ ప్రేమ కథ జోడించాడు సుకుమార్. హెబ్బా పాత్ర చిత్రీకరణ అందరికీ షాకింగ్ గా ఉంటుంది. కాస్త మెచ్యూరిటీ ఉన్నవాళ్లు మాత్రమే ఆ షాక్‌ని తట్టుకోగలరు. లేదంటే.. స్టన్ అయిపోవడం ఖాయం.
రేటింగ్: 2.5/5
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



