అఫీషియల్.. 'చంద్రముఖి-2'లో లారెన్స్
on Jun 14, 2022

మలయాళ చిత్రం 'మణిచిత్రతాజు'(1993) ఆధారంగా కన్నడలో 'ఆప్తమిత్ర'(2004)ను తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు అదే సినిమాను తమిళ్ లో 'చంద్రముఖి'(2005)గా రీమేక్ చేసి ఘన విజయాన్ని అందుకున్న తెలిసిందే. రజినీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన 'చంద్రముఖి' సినిమా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తమిళ్ సీక్వెల్ కోసం ప్రేక్షకుల ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పి.వాసు దర్శకత్వంలో కన్నడ, తెలుగు భాషల్లో ఈ సినిమా సీక్వెల్స్ వచ్చాయి. కన్నడ సీక్వెల్ 'ఆప్తరక్షక' విజయం సాధించగా.. వెంకటేష్ హీరోగా నటించిన తెలుగు సీక్వెల్ 'నాగవల్లి'(2010) మాత్రం పరాజయం పాలైంది. ఇప్పుడు తమిళ్ సీక్వెల్ కి రంగం సిద్ధమైంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ 'లైకా ప్రొడక్షన్స్' చంద్రముఖి సీక్వెల్ 'చంద్రముఖి-2'ని తాజాగా అధికారికంగా ప్రకటించింది. పి.వాసు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. హర్రర్ కామెడీ సినిమాలకు లారెన్స్ పెట్టింది పేరు. 'ముని', 'కాంచన' వంటి ఎన్నో హిట్ సినిమాలు లారెన్స్ ఖాతాలో ఉన్నాయి. దీంతో 'చంద్రముఖి-2'లో లారెన్స్ నటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. అయితే ఇది 'ఆప్తరక్షక', 'నాగవల్లి' కథతోనే తెరకెక్కనుందా? లేక కొత్త కథనా? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి 'చంద్రముఖి-2'ని గతంలోనే లారెన్స్ ప్రకటించాడు. కానీ ఎందుకనో పట్టాలెక్కలేదు. ప్రస్తుతం తమిళ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న లైకా ఇప్పుడు 'చంద్రముఖి-2' బాధ్యతను తీసుకోవడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

వడివేలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ఆర్.డి.రాజశేఖర్, ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి వర్క్ చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



