బ్రహ్మానందం...సార్థకనాముడు!
on Feb 1, 2018
తెరపై హీరో గారు ఎంట్రీ ఇస్తున్నాడూ అనగానే... ముందు కాళ్లు కనిపిస్తాయ్. తర్వాత వెనుకభాగం. ఆ తర్వాత నిదానంగా కెమెరా ముందుకొస్తుంది. హీరోగారు ఓ లుక్ ఇస్తారు. అంతే... థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించడానికి దర్శకులు.. ముందు నుంచి ఎన్నో కసరత్తులు చేస్తారు. రిలీజయ్యాక... థియేటర్లో స్పందన చూసి మురిసిపోతారు.
ఇప్పుడు ఇదంతా దేనికి? అంటే... హీరోలను ఆ స్థాయిలో చూపిస్తే గానీ రాని స్పందన... తెరపై ఒకాయన బట్టతల చూస్తే వస్తుంది. తలపై ఉన్న చందమామ(బట్టతల) చేత్తో నిమురుకుంటూ వెనక్కి తిరిగి ఓ లుక్ ఇస్తే చాలు... థియేటర్ నవ్వల వానలో తడిసి ముద్దవుతాయ్. ఆయనే... ది గ్రేట్ కమెడియన్ బ్రహ్మానందం.
నవ్వడం ఓ భోగం... నవ్వించడం ఓ యోగం... నవ్వకపోవడం ఓ రోగం.. అన్నాడో పెద్దాయన. ఆ ప్రకారంగా చూస్తే..... బ్రహ్మానందం ఓ డాక్టర్. ముప్పై ఏళ్లుగా నవ్విస్తూ... మనలో ఎన్నో మానసిక రుగ్మతలను నశింపజేశాడు. ఆయన నవ్వుల యోగి అయ్యాడు. మనల్ని భోగుల్ని చేశాడు. అంచేత.. మనందరం బ్రహ్మానందానికి రుణపడిపోయామన్నమాట.
గుర్తుచేసుకొని మరీ జనాలు మాట్లాడుకునేంత గొప్ప పాత్రలను ఇప్పట్లో ఎంతమంది చేశారు చెప్పండి? సినిమా నుంచి బయటకు రాగానే కేరక్టర్లను మరిచిపోతున్న పరిస్థితి. అసలు నన్నడిగితే... హీరోల పాత్రలే గుర్తండట్లేదు. కానీ... ఓ ఖాన్ దాదా గుర్తుంటాడు. ఓ నెల్లూరు పెద్దారెడ్డి గుర్తుంటాడు. ఓ కిలిబిల్ పాండే గుర్తుంటాడు, ఓ లవంగం గుర్తుంటాడు, ఓ గచ్చిబౌలీ దివాకర్ గుర్తుంటాడు. అంతేనా... హల్వారాజ్, బాబి, పిల్లి పద్మనాభ శర్మ, మేగ్డోనాల్డ్ మూర్తి. బద్దం భాస్కర్, డాబర్ మేన్... అబ్బో... ఒకటా రెండా!.. బ్రహ్మానందం చేసిన ప్రతి పాత్రా జనాల హృదయాల్లో అలా తిష్ట వేసుకొని కూర్చుంది... దటీజ్ బ్రహ్మానందం!.
రేలంగి వెంకట్రామయ్య, అల్లు రామలింగయ్య తర్వాత... పద్మాశ్రీ అందుకున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం.
రేలంగి, పద్మానాభం, రాజబాబు తర్వాత తెలుగు తెరపై కామెడీ సూపర్ స్టార్ ‘బ్రహ్మానందం’.
వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న హాస్యనట చక్రవర్తి ‘బ్రహ్మానందం’
బ్రహ్మానందం పేరు వినపడగానే... తెలుగువాళ్ల పెదవులు దరహాస చంద్రికలవుతాయ్. రీజన్ లేకుండా లాజిక్కులతో పనిలేకుండా నవ్వేస్తుంటారు. ఏడుస్తున్న బ్రహ్మానందాన్ని చూసి కూడా నవ్వేసే స్థితికి జనాలొచ్చేశారు. అదీ బ్రహ్మానందం అంటే.
ప్రస్తుతం బ్రహ్మానందం చేతిలో సినిమాల్లేవ్. బ్రహ్మానందం పని అయిపోయిందని అనుకుంటున్నారు. ఈ మాట వింటే భయమేస్తోంది. బ్రహ్మానందం సినిమాలు చేయకపోతే... తెలుగు సినిమా హాస్యం ఏమైపోవాలి? తెలుగు సినీ హాస్యానికి వన్నె తెచ్చిన హాస్యనటులంటే... రేలంగి వెంకట్రామయ్య, పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్యల పేర్లు చెబుతారు. నాటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించగల ఏకైక నటుడు ఇప్పుడు బ్రహ్మానందం ఒక్కరే. ఆయన్ను సినిమాలకు దూరం చేస్తే నష్టం ఎవరికి? సినిమా థియేటర్లన్నీ జబర్దస్త్ షోలుగా మారితే... లాభం ఎవరికి?
నేడు హాస్య చక్రవర్తి, నవ్వుల రారాజు బ్రహ్మానందం పుట్టిన రోజు. అవాంతరాలన్నింటినీ అధిగమించి మళ్లీ ఆయన పుంజుకోవాలనీ. ఇంకా మరిన్ని సినిమాలు చేసి థియేటర్లలో నవ్వుల పంటలు పండించాలనీ... మనందరికీ బ్రహ్మానందాన్ని కలిగించాలనీ.. ఆకాంక్షిస్తుందీ ‘తెలుగువన్’.
తెలుగు సినిమా హాస్యం కలకాలం వర్థిల్లాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రహ్మానందం సార్