డీజే వీరయ్య.. 'బాస్ పార్టీ' షురూ
on Nov 23, 2022
'బాస్ పార్టీ' మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' నుంచి 'బాస్ పార్టీ' అంటూ సాగే మొదటి పాట విడుదలైంది. లిరికల్ వీడియోలో వింటేజ్ స్టెప్పులతో మెగాస్టార్ అదరగొట్టాడు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ' లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. డీఎస్పీ తనదైన మాస్ బీట్ తో మెప్పించాడు. ఈ సాంగ్ కి లిరిక్స్ కూడా డీఎస్పీనే అందించడం విశేషం. లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. అలాగే ఈ సాంగ్ ని నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ ఆలపించాడు. ఊర్వశి రౌటేలాతో కలిసి మెగాస్టార్ చిందేసిన ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. లిరికల్ వీడియోలోనే లుంగీ కట్టి తన డ్యాన్స్ గ్రేస్ చూపించాడు చిరు. ఇక ఫుల్ వీడియోలో మెగాస్టార్ స్టెప్పులకు థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న 'వాల్తేరు వీరయ్య'లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా కేథరిన్ థ్రెసా, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
