బాలయ్య.. రియల్ రాకీ భాయ్
on Jun 9, 2022

"గాయపడిన సింహం నుంచి శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది". ఈ మాట నటసింహం నందమూరి బాలకృష్ణకు సరిగ్గా సరిపోతుంది. నందమూరి తారక రామారావు నటవారసుడిగా వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్నో సంచలన విజయాలతో హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న బాలయ్య ఒకానొక సమయంలో చాలా ఏళ్ళ పాటు వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. దీంతో బాలయ్య పనైపోయింది అనుకున్నారంతా. బాలయ్య మీద జోకులు కూడా వేశారు. కానీ 'సింహా'తో బాలయ్య మళ్ళీ గర్జించారు. కాస్త విరామం తర్వాత సింహం వేటకి దిగితే ఎలా ఉంటుందో చూపించారు. మరే సీనియర్ హీరోకి సాధ్యం కాని విధంగా ఇప్పటి కుర్ర హీరోలతో కూడా పోటీ పడుతూ అందరి చేత 'జై బాలయ్య' అనిపించుకుంటున్నారు.

స్టార్ హీరోలలో ఆల్ రౌండర్స్ చాలా తక్కువమంది ఉంటారు. వారిలో బాలయ్య ముందు వరుసలో ఉంటారు. మాస్ అయినా, క్లాస్ అయినా.. పౌరాణికమైనా, జానపదమైనా ఆయన దిగనంతవరకే. ఆయన తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో విభిన్న చిత్రాలు, వైవిధ్య భరితమైన పాత్రలతో అలరించారు. 1974 లో వచ్చిన 'తాతమ్మ కల'తో వెండితెరకు పరిచయమైన బాలయ్య.. 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల మావయ్య', 'నారీ నారీ నడుమ మురారి', 'ఆదిత్య 369', 'రౌడీ ఇన్ స్పెక్టర్', 'సీతారామ కళ్యాణం', 'లారీ డ్రైవర్', 'భైరవ ద్వీపం' ఇలా ఎన్నో విజయాలతో 'టాప్ హీరో'గా ఎదిగారు. ఇక 1999లో వచ్చిన 'సమరసింహా రెడ్డి' అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. 'సమరసింహా రెడ్డి' ఫీవర్ నుంచి ఫ్యాన్స్ బయటపడక ముందే 2001లో 'నరసింహా నాయుడు'తో మరో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలయ్య. రెండేళ్ల గ్యాప్ లో రెండు ఇండస్ట్రీ హిట్స్ పడటంతో బాలయ్య ఇమేజ్ చాలా రేట్లు పెరిగిపోయింది. అదే అప్పుడు బాలయ్య పాలిట శాపంలా మారిపోయింది.

ఎలాంటి పాత్రైనా చేసి మెప్పించగల బాలయ్య.. 'సమరసింహా రెడ్డి', 'నరసింహా నాయుడు' తర్వాత ఓ మూసధోరణిలోకి వెళ్ళిపోయాడు. డైరెక్టర్స్ యాక్టర్ గా బాలయ్యకు పేరుంది. ఒక్కసారి సినిమా ఒప్పుకున్నాక డైరెక్టర్ మాటకి విలువిచ్చి.. డైరెక్టర్ ఏదంటే అది చేస్తాడు బాలయ్య. ఆ స్వేచ్ఛను కొందరు దర్శకులు సరిగా ఉపయోగించుకోక పోగా.. బాలయ్యను నవ్వులపాలు చేశారు. 'లక్ష్మీనరసింహా' లాంటి ఒకటి అరా సినిమాలు ఆకట్టుకున్నా.. 'విజయేంద్ర వర్మ', 'అల్లరి పిడుగు', 'వీరభద్ర', 'మహారథి', 'ఒక్క మగాడు' వంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ఆ సమయంలో బాలయ్యపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కొందరైతే పనిగట్టుకొని మరీ ఆయనపై జోకులేశారు. పొగడ్తలకు పొంగిపోని, విమర్శలకు కృంగిపోని స్వభావమున్న బాలయ్య.. 2010 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సింహా'తో బాక్సాఫీస్ దగ్గర గర్జించి తన స్టామినా తగ్గలేదని రుజువు చేశారు. ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన రెండో మూవీ 'లెజెండ్', క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'తోనూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించారు.

ప్రస్తుతం బాలయ్య టైమ్ చాలా బాగుంది. ఒకప్పుడు ఆయనను ట్రోల్ చేసినవాళ్ళే ఇప్పుడు 'ఆహా బాలయ్య ఓహో బాలయ్య' అంటున్నారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత.. తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య 'అఖండ' సినిమాని విడుదల చేసి సంచలన విజయాన్ని అందుకున్న బాలయ్య సినీ పరిశ్రమలో ధైర్యాన్ని నింపారు. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టి బాలయ్య-బోయపాటి కాంబోకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. ఇక ఓటీటీ వేదిక ఆహాలో బాలయ్య చేసిన 'అన్ స్టాపబుల్'షో ఆయన ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. బాలయ్య ఇంత మంచివాడా!, ఇంత సరదాగా ఉంటాడా! అంటూ ఒకప్పుడు ఆయన ఇష్టపడని వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన అభిమానులుగా మారిపోయారు. భోళాశంకరుడిగా పేరున్న బాలయ్య ఆయన చేసే సేవా కార్యక్రమాలతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.

బాలయ్య అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు. కానీ ఆయన చేసిన కొన్ని సినిమాలు కారణంగా కొందరు ఆయనను పనిగట్టుకొని అప్పుడు ట్రోల్ చేశారు. కానీ బాలయ్య అవేవీ పట్టించుకోలేదు. నమ్మిన దారిలో నిజాయితీగా ఆయన పయనిస్తున్నారు. అదే ఆయన మీదున్న నెగటివ్ అంతా పోయి, పాజిటివ్ వచ్చేలా చేసింది. ఒకప్పుడు అంతటి ట్రోల్స్, అంత నెగటివ్ ఎదుర్కొని.. ఇప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకోవడం ఒక్క బాలయ్యకే చెల్లింది.
(జూన్ 10, బాలకృష్ణ పుట్టినరోజు)
-గంగసాని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



