అనిల్ రావిపూడి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్!
on May 18, 2022
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. పలువురు క్రేజీ దర్శకులతో తన తదుపరి సినిమాలు చేయబోతున్నాడు. తన 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనుండగా.. 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ రెండు సినిమాల అప్డేట్స్ తారక్ పుట్టినరోజు అయిన మే 20న రానున్నాయి. వీటితో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా తారక్ సినిమా ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ రేసులోకి మరో క్రేజీ డైరెక్టర్ వచ్చాడు.
వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి 'F3' సినిమాతో మే 27న ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే డబుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ అవుతాడు. 'F3' సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న అనిల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'F3'కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే.. 'F4' కూడా వచ్చే ఛాన్స్ ఉందని.. కానీ దానికి టైం పడుతుందని అన్నాడు. బాలకృష్ణతో తాను చేయబోయే సినిమా సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందని తెలిపాడు. అలాగే తారక్ తో సినిమా చర్చల దశలో ఉందని, ఇంకా ఫైనల్ కాలేదని చెప్పాడు.
అనిల్ మాటలను బట్టి చూస్తే బాలయ్య ప్రాజెక్ట్ తర్వాత తారక్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది. తారక్ తో అనిల్ కి మంచి అనుబంధముంది. తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ సినిమా 'పటాస్'తోనే అనిల్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటినుంచి తారక్ తో సన్నిహితంగా ఉంటున్న అనిల్.. ఇప్పుడు తారక్ కోసం పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నట్లు టాక్.
Also Read