విశ్వక్ సేన్ ని డైరెక్ట్ చేయనున్న అర్జున్!?
on May 18, 2022
దక్షిణాదిన యాక్షన్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ స్టార్ అర్జున్. కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడిగానూ, రచయితగానూ తనదైన ముద్రవేశాడాయన. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఓ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన `నరసింహనాయుడు` (2001) తాలూకూ తమిళ రీమేక్ `ఏళుమలై`(2002)తో సహా దాదాపు డజను చిత్రాలను అర్జున్ డైరెక్ట్ చేశాడు. వీటిలో `జై హింద్` (1994) వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, నాలుగేళ్ళ స్వల్ప విరామం అనంతరం అర్జున్ మరోమారు మెగాఫోన్ పట్టనున్నాడని సమాచారం. తెలుగులో నేరుగా రూపొందనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తాడని బజ్. అంతేకాదు.. ఇందులో విశ్వక్ సేన్ జంటగా అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ దర్శనమివ్వనుందట. ఇప్పటికే తమిళ్, కన్నడ భాషల్లో నాయికగా సందడి చేసిన ఐశ్వర్యకి ఇది ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ కానుంది. అలాగే, ఇంతకుముందు అర్జున్ దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేసి విజయం అందుకున్న ఐశ్వర్యకి.. ఈ ప్రాజెక్ట్ సెకండ్ కాంబినేషన్ మూవీ కానుంది. మరి.. అర్జున్ - విశ్వక్ సేన్ కాంబినేషన్ పై వస్తున్న కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
