'పోకిరి'లో కంటే 'సర్కారువారి పాట'లో మహేశ్ యంగ్‌గా ఉన్నాడు!
on May 19, 2022
మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ డైరెక్ట్ చేసిన 'సర్కారువారి పాట' బాక్సాఫీస్ దగ్గర తొలి వారాంతం ఊహించిన దానికి మించి వసూళ్లను సాధించి, సోమవారం నుంచి కాస్త నెమ్మదించింది. తిరిగి ఈ రెండో వారాంతంలో మంచి వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఏదేమైనా కీర్తి సురేశ్ నాయికగా నటించిన ఈ సినిమా తొలి ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల షేర్ సాధించిందని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్‌గా తెలపడం గమనార్హం.
మరోవైపు, 'సర్కారువారి పాట'ను తన ఇంట్లోనే చూసిన మహేశ్ తండ్రి సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ ఆ సినిమానీ, మహేశ్‌నీ పొగడ్తలతో ముంచెత్తారు. సినిమా చాలా బాగుందనీ, ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా సాగిందని చెప్పిన ఆయన, సెకండాఫ్‌లో మహేశ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అన్ని సెంటర్లలో మూవీ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తుంటే, కొన్ని చానల్స్ పనిగట్టుకొని మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. 'సర్కారువారి పాట'లో మహేశ్ 'పోకిరి'లో కంటే యంగ్‌గా కనిపించాడని మెచ్చుకున్నారు. ఫిట్నెస్ కోసం మహేశ్ బాగా కష్టపడతాడనీ, షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా జిమ్‌లోనే గడుపుతుంటాడని చెప్పారు.
సినిమా చూసిన వెంటనే మహేశ్‌కు ఫోన్ చేసి బాగా నటించావనీ, 'పోకిరి', 'దూకుడు' సినిమాల కంటే కూడా 'సర్కారువారి పాట' పెద్ద హిట్టవుతుందని చెప్పాననీ, దాంతో మహేశ్ చాలా హ్యాపీ ఫీలయ్యాడనీ కృష్ణ తెలిపారు. మహేశ్ 'అల్లూరి సీతారామరాజు' సినిమా చేసే అవకాశాలు లేవని కూడా ఆయన అన్నారు. కాగా, ఈనెల 31న ఆయన 79వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.
Also Read