ENGLISH | TELUGU  

జంద్యాల చేసిన సాహ‌సం ఆనంద‌భైర‌వి!

on Jul 28, 2018

తెలుగుద‌నం, సంప్ర‌దాయం, నైతిక విలువ‌లు, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌...

తెలుగు సినిమాల క‌థ‌ల్లో కొర‌వ‌డుతున్న‌ అంశాలివి. ప్ర‌స్తుత ప్రాధాన్య‌తంతా వినోదానికే. అందుకే.. తెర‌పై విప‌రీత ధోర‌ణులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయ్‌. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సినిమాలు చూడ‌లేని ప‌రిస్థితి. పోనీ.. ఇవేమ‌న్నా థియేట‌ర్ల‌కే ప‌రిమితం అవుతాయా? అంటే అదీ లేదు.. నెల తిరిగే లోపు ఇళ్లల్లోకొచ్చేస్తాయ్‌. వ‌చ్చే ఆదివారం సాయంత్రం 6.గంల‌కు ఫ‌లానా సినిమా.. అని టీవీల్లో ప్ర‌క‌ట‌న రాగానే.. ఇంట్లో పెద్ద‌ల గుండెలు గుభేల్‌!.. ఈ సినిమా పిల్ల‌ల కంట ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలో.. అని ఒక‌టే టెన్ష‌న్‌. ఇది ప్ర‌స్తుతం తెలుగు సినిమా ప‌రిస్థితి. ఆ సినిమాల పేర్లేంటి? వాటి పూర్వాప‌రాలేంటి? అనేది ఇప్పుడు అప్ర‌స్తుతం. ఇలాంటి విషాద‌క‌ర‌, విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి కాస్తంత ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఓ సారి ఫ్లాష్‌బ్యాక్ వెళ్లాల్సిందే..

 

 

విశ్వ‌నాథ్‌గారు శంక‌రాభ‌ర‌ణం తీశాకా..

జ‌నాలు చూశాకా.. తెలుగునేల‌పై చాలా మార్పులొచ్చాయ్‌. సంగీత క‌ళాశాల‌లు ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ లెక్క‌లేన‌న్ని పుట్టుకొచ్చాయ్‌. దానికి కార‌ణం.. ఆ సినిమా పుణ్య‌మా అని శాస్త్రీయ సంగీతంపై జ‌నాల‌కు మ‌క్కువ పెర‌గ‌డ‌మే. సాధార‌ణంగా ఇలాంటి విజ‌యాలొచ్చిన‌ప్పుడు.. ఇక అదే దారిలో సినిమాలు రూపొందటం మ‌నం చూస్తూనే వున్నాం. కానీ శంక‌రాభ‌ర‌ణం అనుస‌ర‌ణ‌కు సాధ్యం కాని సినిమా. అందుకే అంత‌టి విజ‌యం త‌ర్వాత కూడా ఎవ‌రూ ఆ త‌ర‌హా క‌థ‌ల జోలికి పోలేదు. విశ్వ‌నాథ్‌గారు త‌ప్ప‌. అయితే.. ఒక ద‌ర్శ‌కుడు మాత్రం శంక‌రాభ‌ర‌ణాన్ని ల‌క్ష్యంగా తీసుకున్నారు. ఆ సాహ‌సోపేత‌మైన ప్ర‌య‌త్నం వ‌ల్లే.. ఒక అద్భుత‌మైన క‌ళాఖండం తెలుగుతెర‌ను ప‌ల‌క‌రించింది. ఆ సినిమా పేరే.. ఆనంద‌భైర‌వి. శంక‌రాభ‌ర‌ణం.. రాగంపేరే, ఆనంద‌భైర‌వి రాగం పేరే. ఇంత చెప్పాక‌.. కాస్తంత సినిమాప‌రిజ్ఞానం ఉన్న ఎవ‌రైనా.. ఆ ద‌ర్శ‌కుని పేరు చెప్పేస్తారు... ఎస్‌.. ఆయ‌నే... జంధ్యాల‌. శంక‌రాభ‌ర‌ణంలో విశ్వ‌నాథ్‌గారు స్పృశించిన అంశాలు.. భార‌తీయ క‌ళ‌లు, సంస్కృతి, సంప్ర‌దాయాలు, స‌మ‌స‌మాన‌త్వం, మాన‌వ‌త్వం. ఇవ‌న్నీ ఆనంధ‌భైర‌విలో కూడా పుష్క‌లంగా ఉంటాయ్‌. వీటితో పాటు చ‌క్కిలిగింత‌లు పెట్టే జంధ్యాల మార్క్ హాస్యం.

కుల విద్య‌కు సాటిరాదు గువ్వ‌ల చెన్నా అని పెద్ద‌లు చెబుతారు..

త‌న ధ‌ర్మాన్ని విడిచి ప‌ర ధ‌ర్మం పాటించ‌డం మ‌హాపాపం అని భ‌గ‌వ‌ద్గీత చెబుతుంది. పైగా క‌ళ దైవ‌ద‌త్తం. వంశ‌పార‌ప‌ర్యంతం వ‌స్తున్న క‌ళారాధ‌న‌ను దైవ స‌మానంగా భావించి పూజించాల్సింది పోయి.. క‌ట్టుకున్న ఇల్లాలు, క‌న్న‌బిడ్డే చిన్న‌చూపు చూస్తే... త‌న‌లోని క‌ళ త‌న‌తోనే అంతం కారాద‌ని.. ఓ దొమ్మ‌రి పిల్ల‌కు త‌న‌లోని క‌ళ‌ను ధార‌పోసిన మ‌హా క‌ళాత‌ప‌స్వి క‌థే ఆనంధ‌భైర‌వి. కులం బ‌హిష్క‌రించినా.. సంఘం వేలెత్తి చూపినా.. లెక్క చేయ‌క, వెన‌క‌డుగేయ‌క‌.. ఆ దొమ్మ‌రిపిల్ల‌నే నాట్య మ‌యూరిగా, క‌ళాస‌ర‌స్వ‌తిగా తీర్చిదిద్దిన కూచిపూడి నాట్యాచార్యుని క‌థే ఆనంద‌భైర‌వి. ఆనంద‌భైరవిలో.. స‌మాజంలోని వివ‌క్ష‌ల‌పై జంధ్యాల చేసిన అక్ష‌ర పోరాటం సామాన్య‌మైంది కాదు. వివాహ వ్య‌వ‌స్థ‌ను మ‌నుషులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆనంద‌భైర‌వి చూస్తే తెలుస్తుంది. గ‌ళ‌సూత్ర‌ధార‌ణ అనే తంతుకు అస‌లు కార‌ణం ఏంటి? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆనంద‌భైర‌వి చూస్తే తెలుస్తుంది. తొలినాళ్ల‌లో బాల్య వివాహ వ్య‌వ‌స్త ఏర్ప‌డ‌టానికి కార‌ణం ఏంటి అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆనంద‌భైర‌వి చూస్తే తెలుస్తుంది. అంతేకాదు... కులం క‌న్నా గుణం ప్రాధ‌న‌మ‌ని, స‌మాన‌త్వ‌మే స‌మాజోభ్యుద‌యానికి ప‌ట్టుకొమ్మ అని తెలియ‌జెప్పే సినిమా ఆనంధ‌భైర‌వి. సినిమా అంటే వినోదం మాత్ర‌మే కాదు.. నైతిక విలువ‌తో కూడిన విజ్ఞానం కూడా.. దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ఆనంధ‌భైర‌వి చెప్పొచ్చు. భార‌తీయ క‌ళ‌ల గొప్ప‌త‌నాన్ని, మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల అచిత్యాన్ని ఈ క‌థ‌లో తెలియ‌జేస్తూనే.. దానికి స‌మాంత‌రంగా ఓ హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌ను కూడా న‌డిపించారు జంధ్యాల‌. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ ఆనంద‌భైర‌వి అల‌రించిందంటే దానికి కార‌ణం అదే.

కూచిపూడి నాట్యాచార్యునిగా ఇందులో గిరీష్ క‌ర్నాడ్ న‌టించారు. కేవ‌లం ఈ సినిమా కోసమే ఆయ‌న నాట్యం నేర్చుకున్నారంటే.. న‌టునిగా ఆయ‌న‌లోని నిబ‌ద్ధ‌తేంటో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌ళ‌వికా స‌ర్కార్ ఇందులో క‌థానాయిక‌. ఈ సినిమా త‌ర్వాత త‌ను మ‌రో సినిమాలో క‌నిపించ‌లేదు. ఆనంద‌భైర‌విగా జ‌న‌హృద‌యాల్లో నిలిచిపోయింది. రాజేశ్‌, కాంచ‌న‌.. ఇలా అంద‌రూ ల‌బ్ద‌ప్ర‌తిష్టులైన న‌టులే. అంద‌రూ త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు. ఇక సుత్తివీర‌భ‌ద్ర‌రావు, సుత్తివేలు, శ్రీల‌క్ష్మిల హాస్యం.. సినిమా వ‌చ్చి 35 ఏళ్ల‌యినా.. ఇంకా జ‌నాన్ని న‌వ్విస్తూనే ఉంది. ఇక ర‌మేశ్‌నాయుడు ఆణిముత్యాల్లాంటి పాట‌లు ఈ సినిమాకు ఆభ‌ర‌ణాలు. ఈ సినిమాలో ప‌తాక స‌న్నివేశంలో.. క‌పాల‌మోక్షం అనే కాన్సెప్ట్‌ని జంధ్యాల తెర‌కెక్కించిన‌ తీరు అమోఘం. విలువ‌లు, వ‌లువ‌లు రెండూ లేని సినిమాలు విడుద‌లవుతున్న నేటి త‌రుణంలో.. ఆనంద‌భైర‌వి లాంటి క్లాసిక్స్‌.. జ‌నాల‌కు ఎడారిలో ఓ ఒయాసీస్ లాంటివి. ఇంకెందుకు ఆల‌స్యం.. చూసేయండి.. చూసి త‌న్మ‌యానికి లోన‌వ్వండి.. ఆత్మానందాన్ని పొందండి..

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.