ఆ మూడు సినిమాలపైనే అందరి దృష్టి.. విజయం వరిస్తుందా?
on Jul 13, 2022

ఒకవైపు టాలీవుడ్ నుంచి వస్తున్న కొన్ని పాన్ ఇండియా సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంటే.. మరోవైపు టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ మాత్రం రోజురోజుకి దారుణంగా పడిపోతుంది. ఈ ఏడాది ఇప్పటికే సగం పూర్తయింది. ఈ ఆరు నెలల కాలంలో ఎన్నో సినిమాలు విడుదల కాగా పట్టుమని ఆరు సినిమాలు కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు. చివరిగా జూన్ 3న విడుదలైన 'మేజర్' మూవీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ఐదారు వారాల్లో 'అంటే సుందరానికీ', 'విరాట పర్వం', 'పక్కా కమర్షియల్' సహా చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా కూడా బయ్యర్లకు లాభాలను తీసుకురాలేదు. దీంతో విడుదలకు సిద్ధమవుతున్న మూడు కొత్త సినిమాలపై అందరి దృష్టి పడింది.
ఈ నెలలో వారానికో చెప్పుకోదగ్గ సినిమా విడుదలవుతోంది. రేపు(జూన్ 14న) రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్' తరహా యాక్షన్ సన్నివేశాలు, మాస్ డ్యాన్స్ స్టెప్పులు ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తాయేమో చూడాలి.
అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి క్లాస్ హిట్ అందించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'థాంక్యూ'. ఈ సినిమా జులై 22 న థియేటర్స్ లోకి రానుంది. రీసెంట్ గా విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. లవ్, ఎమోషన్స్ తో కూడిన ఓ బ్యూటిఫుల్ జర్నీ లాంటి ఈ మూవీ చైతన్యకు మెమొరబుల్ హిట్ ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
గతేడాది 'క్రాక్'తో సాలిడ్ హిట్ అందుకొని దాదాపు నాలుగేళ్ళ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజ రవితేజ.. మళ్ళీ ఈ ఏడాది వచ్చిన 'ఖిలాడి'తో నిరాశపరిచాడు. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో లెక్క సరిచేయడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జులై 29న విడుదల కానుంది. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్, టీజర్ ని బట్టి చూస్తే హిట్ కళ బాగానే కనిపిస్తుంది.
వారానికో సినిమా చొప్పున ఒకే నెలలో విడుదలవుతున్న ఈ క్రేజీ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



