చివరి శ్వాస దాకా నటునిగా జీవించిన తెలుగు సినిమా దిక్సూచి.. అక్కినేని!
on Sep 20, 2022

అక్కినేని.. ఈ నాలుగు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఒక ఆనందపు పిల్లతెమ్మెర ప్రత్యక్షమవుతుంది. ఆ పేరును తలుచుకుంటేనే చాలు.. ప్రపంచంలోని విషాదమంతా ప్రేక్షకుల గుండెల్ని పలకరించి వెళ్తుంది. ఆయన డైలాగులు ప్రేక్షకులకు మనోరంజనాలు. ఆయన డ్యాన్సులు తెలుగు సినిమాకు మేలిమలుపులు. ఆయన నటన తెలుగు సినిమాకు ఓ నిఘంటువు..
ఒక బాలరాజు, ఒక దేవదాసు, ఒక విప్రనారాయణ, ఒక భక్త తుకారాం, ఒక దసరా బుల్లోడు, ఒక దొంగరాముడు, ఒక డాక్టర్ చక్రవర్తి, ఒక మహాకవి క్షేత్రయ్య, ఒక తెనాలి రామకృష్ణ.. ఇలా ఆ మహానటుని నట ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు.. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోసిన మహానటుడు అక్కినేని.

కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉన్న ఓ చిన్న గ్రామం రామాపురం.. ఎనిమిది దశాబ్దాల క్రితం ఆ పక్కగ్రామానికి కూడా సరిగా తెలియని ఈ ఊరు ఇప్పుడు మాత్రం ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు సినిమా భవిష్యత్తును శాసించగలిగే ఓ మహానటుడ్ని వెండితెరకు అందించిన ఆ గ్రామం తెలుగు సినీ పరిశ్రమకు తన వంతు సేవ చేసింది.
వెండితెర మీద మహానటునిగా ఎదగాల్సిన అక్కినేనిని బడిలో పుస్తకాల మధ్య కూర్చోటానికి విధి కూడా ఒప్పుకోలేదు. అందుకే చిన్న వయసులోనే నటన మీద ఉన్న ఆసక్తితో నాటకాలు వేయడం ప్రారంభించారు అక్కినేని.. ఆ అనుభవమే ఆయన్ను వెండితెర వైపు నడిపించింది.

1940లో 17 ఏళ్ల వయసులోనే 'ధర్మపత్ని' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు. తరువాత పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన 1944లో 'సీతారామ జననం' సినిమాతో హీరోగా మారారు. హీరోగా నటించిన తొలి చిత్రంలోనే శ్రీ రామునిగా నటించి మెప్పించారు అక్కినేని.
తొలి సినిమాతోనే అపూర్వ విజయం అందుకున్న అక్కినేని తరువాత వరుసగా 'బాలరాజు', 'కీలుగుర్రం' లాంటి జానపద సినిమాలతో తిరుగులేని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు..రెండు వందలకు పైగా చిత్రాల్లో ఎన్నో అపురూప పాత్రలతో తెలుగు సినిమాకు నటనా సత్కారం చేశారు.

సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినిమా తెరపై నటనకు నవ్యభాష్యాన్నిచ్చాయి. ముఖ్యంగా.. భగ్న ప్రేమికునిగా ఆయన పొషించిన పాత్రలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. 'లైలా మజ్ను', 'దేవదాసు' లాంటి సినిమాల్లో ఆయన నట విన్యాసాలకు ప్రేక్షకులు కనక వర్షమే కురిపించారు.
ముఖ్యంగా 1953లో రిలీజ్ అయిన 'దేవదాసు' సినిమా అక్కినేని నట ప్రస్థానంలో కీలక ఘట్టం. శరత్‌చంద్ర ఛటర్జీ రాసిన దేవదాసు పాత్రను ఎంతో అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన అక్కినేని.. ఆ పాత్రను తరువాత ఎవరు పోషించినా ఆయనంత గొప్పగా తాము చెయ్యలేకపోయామని ప్రశంసలు ఆ నటుల చేతే పొందారు. కేవలం ప్రేమికుడిగానే కాదు.. వెండితెర మీద మహాభక్తునిగా కూడా ఆయన నటన అనితరసాధ్యం అనే పేరు తెచ్చుకున్నారు. స్వతహాగా నాస్తికుడు అయిన అక్కినేని తెర మీద మాత్రం మహాభక్తునిగా ఎన్నో పాత్రలకు తన అద్భుత నటనతో జీవం పోయడం ఓ విశేషం.

సుదీర్ఘ నట ప్రస్థానంలో ఏఎన్నార్ ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని, గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని, నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నటునిగా, నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయం.
ఒక నటుడిగా ఎదిగి.. ఒక మనిషిగా ఒదిగి.. ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు అక్కినేని. రొమాంటిక్ కింగ్... ట్రాజెడీ కింగ్.. నట సమ్రాట్.. ఇలాంటి బిరుదులెన్నో ఆయన్ను కౌగలించుకున్నాయి. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని.. దానికంటే ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మభూషణ్.. అటు తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే.. పద్మవిభూషణ్.. ఇలా ఉన్నత పౌర పురస్కారాల్ని చేజిక్కించుకున్నారు అక్కినేని.

ఊపిరి ఉన్నంత వరకూ కళాకారునిగానే జీవిస్తానని చెప్పిన మాటను తూ.చ. తప్పక పాటించి, కేన్సర్ మహమ్మారి శరీరాన్ని దుర్బలం చేస్తున్నా, ఓపికతో 90 ఏళ్ల వయసులో కూడా మనం సినిమాలో నటించటానికి అంగీకరించారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యం సహకరించకపోవటంతో మధ్యలో ఓసారి ఆ షూటింగ్‌కు విరామం ప్రకటించారు. తిరిగి, తన పాత్రను పూర్తిచేసి, నిజ జీవితంలోనూ తన పాత్ర ముగిసిందని అర్థం చేసుకొని, కోట్లాదిమంది అభిమానుల గుండెలను బద్దలుచేస్తూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. అయినటికీ ఏఎన్నార్ లివ్స్ ఆన్ ఫరెవర్...
(నేడు అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



