ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం కూడా రోగమే!
on Nov 1, 2022

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అలనాటి తార ఎల్. విజయలక్ష్మి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో సోమవారం ఆమెకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "అమెరికాలో స్థిరపడిన విజయలక్ష్మి గారు ఈ అవార్డు అందుకోవడానికి ఇంతదూరం ప్రయాణించడం నాన్న(ఎన్టీఆర్) గారి పట్ల ఆమెకున్న గౌరవం అర్థమవుతోంది. ఆమె సినీ ప్రయాణంలో వందకి పైగా సినిమాలు చేస్తే, అందులో సుమారు 60 సినిమాలు నాన్న గారితో చేసుంటారు. విభిన్న రకాల నాట్యాలను ప్రదర్శించి ఆమెకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అప్పట్లో కుశల కుమారి గారు, జ్యోతి గారు, పద్మిని ప్రియదర్శిని గారు ఎందరో ఉన్నారు కానీ విజయలక్ష్మి గారి స్థాయిలో నిలబడలేకపోయారు, ఆమె చేసినన్ని చిత్రాలు చేయలేకపోయారు. కళామతల్లికి ఆమె చేసిన ఎనలేని సేవకు అభినందనలు, కృతఙ్ఞతలు. నటీనటులు ఒక స్థాయికి చేరుకున్నాక విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆమె అమెరికా వెళ్ళాక కూడా సీఏ చేసి వర్జీనియా యూనివర్సిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రయాణం ఇంకా ఆగలేదు. విభిన్న రకాల డ్యాన్స్ లు ఇంకా నేర్చుకుంటున్నారు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం అదొక రోగం. ఆమె జీవితంలో ఎంతో సాధించారు. మహిళా సాధికారితకు ఆమె ప్రతీక. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె ఇలాగే ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



