వరుసగా 12 ప్లాప్ లు.. అయినా హీరోగా నిలబడ్డ నితిన్
on Jun 14, 2022

సినీ పరిశ్రమలో నిలబడాలంటే సక్సెస్ ఉండాలి. కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్స్ అందుకొని ఆ తర్వాత వరుస ప్లాప్ లతో అవకాశాల్లేక ఇబ్బంది పడ్డ హీరోలు ఎందరో ఉన్నారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సక్సెస్ లేకపోతే ఇక్కడ నిలబడలేరు అంటారు. కానీ హీరో నితిన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. 20 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాలు చేశాడు, పట్టుమని పది హిట్లు కూడా లేవు. ఒకానొక సమయంలో వరుసగా 12 ప్లాప్ లు చూశాడు. అయినా హీరోగా నిలబడి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2002, జూన్ 14న విడుదలైన 'జయం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత 2003 లో నితిన్ హీరోగా నటించిన రెండు సినిమాలు విడుదలవ్వగా..అందులో 'దిల్' మూవీ సూపర్ హిట్ కాగా, 'సంబరం' పరాజయం పాలైంది. 2004 లో కూడా రెండు సినిమాలతో పలకరించిన నితిన్.. 'శ్రీ ఆంజనేయం'తో మరో ప్లాప్ ని చూసి, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై'తో మాత్రం మంచి విజయాన్ని అందుకున్నాడు.

కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా మూడు ఏళ్లలో మూడు సూపర్ హిట్స్ అందుకోవడంతో ఇక నితిన్ హీరోగా మంచి స్థాయికి వెళ్తాడని భావించారంతా. కానీ 2005 నుంచి నితిన్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. 2005లో విడుదలైన 'అల్లరి బుల్లోడు' నుంచి 2011లో వచ్చిన 'మారో' వరకు వరుసగా 12 ప్లాప్ లు చూశాడు. వేరే ఎవరైనా అయ్యుంటే అన్ని ప్లాప్ లు ఎదురైతే కృంగిపోతారు. ఇక మన వల్ల కాదని వదిలేస్తారు కూడా. కానీ నితిన్ మాత్రం అలుపెరుగని విక్రమార్కుడిలా విజయం కోసం ప్రయత్నించాడు. అలా 2012 లో 'ఇష్క్'తో సాలిడ్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ తర్వాత 2013 లో విడుదలైన 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాతో మరో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి మూడు ప్లాప్ లు, ఒక హిట్ అన్నట్లుగా నితిన్ కెరీర్ సాగిపోతోంది.
'గుండె జారి గల్లంతయ్యిందే' తర్వాత వరుసగా మూడు ప్లాప్ లు చూసిన నితిన్.. 2016 లో వచ్చిన 'అఆ'తో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మరో మూడు పరాజయాలు ఎదుర్కొన్న ఈ హీరో.. 2020 లో విడుదలైన 'భీష్మ'తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక గతేడాది 'చెక్', 'రంగ్ దే', 'మాస్ట్రో' అంటూ మూడు సినిమాలతో పలకరించిన నితిన్ పర్వాలేదు అనిపించుకున్నాడు. త్వరలో 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'మూడు ప్లాప్ లు, ఒక హిట్' సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా నితిన్ కి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నో పరాజయాలు ఎదురైనా తను నమ్మిన దారిలో వెళ్తూ పోరాడి నిలబడిన నితిన్ కి హ్యాట్సాఫ్.
-గంగసాని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



