'భలే అమ్మాయిలు' వచ్చి నేటికి సరిగ్గా 65 ఏళ్లు!
on Sep 6, 2022

నందమూరి తారకరామారావు, సావిత్రి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో, ఆకట్టుకుందో! అలా వారు అలరించిన చిత్రాల్లో ఒకటి.. 1957 సెప్టెంబర్ 6న విడుదలైన 'భలే అమ్మాయిలు'. అంటే ఆ సినిమా వచ్చి, నేటికి సరిగ్గా 65 సంవత్సరాలు గడిచాయి. ఈ మూవీలో టైటిల్ రోల్స్‌లో సావిత్రి, గిరిజ పోషించారు. ఆ ఇద్దరూ సరోజ, గిరిజ అనే అక్కచెల్లెళ్లుగా నటించారు. సావిత్రి జంటగా ఎన్టీఆర్, గిరిజ జోడీగా జగ్గయ్య చేశారు.
నేనే గొప్ప అంటే నేనే గొప్ప.. అని తరచూ పోట్లాడుకునే సరోజ, గిరిజ ఇద్దరూ వెంకట్రామయ్య (రేలంగి) అనే విద్వాంసుని దగ్గర సంగీతం నేర్చుకుంటారు. అనారోగ్యంతో హఠాత్తుగా తల్లి (హేమలత) చనిపోవడంతో అక్కచెల్లెళ్ల జీవితాలు ఒక్కసారిగా కుదుపుకు గురవుతాయి. జీవనోపాధి కోసం సరోజ ఓ ఇంట్లో పనిమనిషిగా చేరితే, గిరిజ కాలేజీలో చేరుతుంది. సరోజ పనిచేసే ఇంటి వారసుడు డాక్టర్ ఆనంద్ (ఎన్టీఆర్) ఆమెతో ప్రేమలో పడతాడు. మరోవైపు గిరిజ కూడా కేశవ్ (జగ్గయ్య)ను ప్రేమిస్తుంది. అయితే అతను ఆమెను మోసం చేస్తాడు. చివరకు రెండు జంటలకు ఎలా పెళ్లిళ్లు జరిగి, కథ సుఖాంతమైందనేది ఆసక్తికరంగా దర్శకుడు వేదాంతం రాఘవయ్య చిత్రీకరించారు.
ప్రధాన పాత్రధారులతో పాటు మిగతా తారాగణం కూడా పాత్రోచితంగా నటించడం, సదాశివబ్రహ్మం రచన, సాలూరి రాజేశ్వరరావు, సాలూరి హనుమంతరావు సంగీతం ఈ సినిమాను విజయవంతం చేశాయి. రేలంగి, సీఎస్ఆర్ ఆంజనేయులు, పేకేటి శివరామ్, బాలకృష్ణ (అంజి), ఛాయాదేవి, హేమలత సూర్యకళ ఇతర పాత్రధారులు.
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగె, అందాల రూపము ఆనంద దీపము, ఓహో బంగరు చిలుకా, గోపాల జాగేలరా ననులాలించి పాలింప రావేలరా, దాగుడుమూతలు చాలునురా లాంటి పాటలు సంగీత ప్రియులను అమితంగా రంజింపజేశాయి. దాదాపు 3 గంటల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని నరసు స్టూడియోస్ బ్యానర్‌పై వి.ఎల్. నరసు నిర్మించారు.
సదాశివబ్రహ్మం కథ, మాటలు అందించగా, ఆయనతో పాటు కొసరాజు పాటలు రాశారు. వి. కుమారదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా, హనుమంతు ఎడిటర్‌గా పనిచేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



