ఏయన్నార్, సావిత్రి ఫ్యామిలీ డ్రామా `తోడి కోడళ్ళు`కి 65 వసంతాలు!
on Jan 11, 2022

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పలు చిత్రాలు తెలుగునాట క్లాసిక్స్ గా నిలిచాయి. అలాంటి ఈ ఇరువురు తొలిసారిగా జట్టుకట్టిన సినిమా `తోడి కోడళ్ళు`. ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ రచించిన `నిష్కృతి` నవల ఆధారంగా ఈ ఫ్యామిలీ డ్రామా రూపొందింది. ఇందులో ఏయన్నార్ కి జంటగా మహానటి సావిత్రి నటించగా ఎస్వీ రంగారావు, కన్నాంబ, సూర్యకాంతం, రేలంగి, రాజసులోచన, జగ్గయ్య, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
మాస్టర్ వేణు అందించిన బాణీలకు శ్రీ శ్రీ, తాపీ ధర్మారావు, ఆచార్య ఆత్రేయ, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని ``ఆడుతూ పాడుతూ``, ``కారులో షికారుకెళ్ళే`` పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవగా, ``ఎంతెంత దూరం``, ``నలుగురు కలిసి``, ``గాలిపటం గాలిపటం``, ``కలకాలం ఈ కలత``, ``టౌను పక్కకి వెళ్ళొద్దురా``, ``శ్రీరస్తు శుభమస్తు``, ``నీ షోకు చూడకుండా``, ``భలే మావయ్య`` గీతాలు కూడా రంజింపజేశాయి. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై డి. మధుసూదనరావు నిర్మించిన ఈ సినిమా.. తమిళంలో `ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి` పేరుతో దాదాపు ఇదే టీమ్ తో రూపొంది అక్కడా విజయం సాధించింది. 1957 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై జననీరాజనాలు అందుకున్న `తోడి కోడళ్ళు`.. నేటితో 65 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



