మళ్లీ మళ్లీ చూడాలనిపించే బాలీవుడ్ సీక్వెల్స్
on May 6, 2020

సీక్వెల్స్ తీయడం కత్తి మీద సాము వ్యవహారం. హాలీవుడ్‌లో 'గాడ్‌ఫాదర్' సిరీస్ బ్లాక్‌బస్టర్ అవడమే కాదు, ఒక ట్రెండ్‌సెట్టర్ కూడా అయ్యింది. ఆ ట్రెండ్‌లో.. ఆ తర్వాత అనేక ఫ్రాంచైజీలు వచ్చాయి. వాటిలో స్టార్‌వార్స్, ద ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్, అవెంజర్స్, ఎక్స్-మెన్, హారీపాటర్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ వంటి కొన్ని ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణకు నోచుకున్నాయి. హాలీవుడ్‌లో వచ్చిన ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండే బాలీవుడ్ సైతం ఆ ట్రెండ్స్‌ను అడాప్ట్ చేసుకొని, ఫ్రాంచైజీలను రూపొందిస్తూ వస్తోంది. వాటిలో ఒరిజినల్‌ను మించి ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్న, మరోసారి కూడా చూద్దామనిపించిన సీక్వెల్స్ ఏవో చెప్పుకుందాం...
టైగర్ జిందా హై (2017)

సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషించగా, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ జిందా హై' బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపడమే కాకుండా, మోస్ట్ వాచబుల్ మూవీస్‌లో ఒకటిగా ప్రశంసలు పొందింది. ఇండియాలో 339.16 కోట్ల రూపాయల నెట్ వసూలు వేసిన ఈ మూవీ, 2012లో వచ్చిన 'ఏక్ థా టైగర్' మూవీకి సీక్వెల్. 198.78 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఒరిజినల్‌కు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా కత్రినా కైఫ్ నటించడం విశేషం. ఇండియన్ ఏజెంట్ టైగర్ క్యారెక్టర్‌లో సల్మాన్ నటనకు ఆడియెన్స్ జేజేలు పలికారు.
ధూమ్ 3 (2013)

'ధూమ్' ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి బాక్సాఫీస్‌ను దద్దరిల్లచేశాయి. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా క్రియేట్ చేసిన స్టోరీతో 2004లో వచ్చిన ఒరిజినల్ 'ధూమ్'కు, ఆ తర్వాత 2006లో వచ్చిన 'ధూమ్ 2' మూవీకి సంజయ్ గధ్వి డైరెక్షన్ చేయగా, 'ధూమ్ 3'ని మునుపటి రెండు సినిమాలకు రైటర్‌గా పనిచేసిన విజయ్‌కృష్ణ ఆచార్య రూపొందించాడు. మూడు సినిమాల్లోనూ హీరోగా అభిషేక్ బచ్చన్ నటించగా, 'ధూమ్ 3'లో విలన్‌గా ఆమిర్ ఖాన్ చెలరేగిపోయాడు. 'ధూమ్' విలన్ జాన్ అబ్రహాం. 'ధూమ్ 2' విలన్ హృతిక్ రోషన్‌లను మించి ఆమిర్ రాణించాడు. పైగా ఈ సినిమాలో ఆయన ట్విన్స్‌గా డబుల్ రోల్ పోషించడం గమనార్హం. ఆమిర్‌ను విలన్‌గా చూసేందుకు ఆడియెన్స్ ఎగబడటంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 284.27 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఒరిజినల్ 'ధూమ్' మూవీకి వచ్చిన 31.60 కోట్ల రూపాయలతో పోలిస్తే దాదాపు 9 రెట్లు అధికంగా 'ధూమ్ 3' కలెక్ట్ చేయడం విశేషం!
క్రిష్ 3 (2013)

హృతిక్ రోషన్ స్టార్ హీరోగా రూపాంతరం చెందడంలో ఆయన తండ్రి రాకేశ్ రోషన్ పాత్ర చాలా ఉంది. ఆయన డైరెక్షన్‌లోనే 'కహో నా ప్యార్ హై' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న హృతిక్.. ఆ తర్వాత కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు 2003లో వచ్చిన 'కోయీ మిల్ గయా' మూవీతో నిలదొక్కుకుంది తండ్రి డైరెక్షన్‌లోనే. 'క్రిష్' ఫ్రాంచైజీలో మొదటి సినిమా అదే. ఆ తర్వాత 'క్రిష్' పేరుతో 2006లో వచ్చిన సీక్వెల్‌తోనూ అలరించాడు హృతిక్. అది ఇండియాలో 72.16 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, 2013లో వచ్చిన 'క్రిష్ 3' మూవీ 244.92 కోట్లను రాబట్టి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లోనూ హృతిక్ జోడీగా ప్రియాంకా చోప్రాను ఆడియెన్స్ ఆదరించారు.
గోల్‌మాల్ అగైన్ (2017)

ఇండియాలో ఒక ఫ్రాంచైజీలో నాలుగో సినిమా వచ్చి బ్లాక్‌బస్టర్ కావడం 'గోల్‌మాల్ అగైన్' మూవీతోనే తొలిసారి మనం చూశాం. డైరెక్టర్ రోహిత్ శెట్టి, స్టార్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్ కాంబినేషన్ ప్రతిసారీ సూపర్ హిట్టేనని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఒరిజినల్ మూవీ 'గోల్‌మాల్: ఫన్ అన్‌లిమిటెడ్' 2006లో వచ్చి విజయం సాధించి 29.54 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తే, ఆ సిరీస్‌లో నాలుగో సినిమా ఏకంగా 205.69 కోట్లను వసూలు చేయడం విశేషం. అంటే ఒరిజినల్ కంటే సుమారు ఏడు రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసిందన్నమాట. ఒక కామెడీ ఎంటర్‌టైనర్ జానర్‌లో వచ్చిన సీక్వెల్ ఈ రేంజిలో వసూళ్లు సాధించడం రోహిత్, దేవగణ్ జోడీ మహిమేనని చెప్పాలి.
బాఘి 2 (2018)

ఒరిజినల్ స్టోరీలతో కాకుండా వేరే భాషలో వచ్చిన సినిమాల ఆధారంగా రూపొందిన ఫ్రాంచైజీగా 'బాఘి' ప్రత్యేకత సంతరించుకుంది. 2016లో వచ్చిన 'బాఘి' మూవీకి ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'వర్షం' ఆధారం కాగా, 2018లో వచ్చిన 'బాఘి 2'కు అడివి శేష్ సినిమా క్షణం ఆధారం. ఒక ఈ ఏడాదే వచ్చిన ఈ ఫ్రాంచేజీలో మూడో సినిమా 'బాఘి 3'కి తమిళ హిట్ ఫిల్మ్ 'వేట్టై' ఆధారం కావడం గమనార్హం. ఈ మూడు సినిమాల్లోనూ రోనీ పాత్రలో టైగర్ ష్రాఫ్ చేసిన ఎలక్ట్రిఫయ్యింగ్ ఫైట్స్‌కు యాక్షన్ ప్రియులు ఫిదా అయ్యారు. స్టోరీ లైన్ వేరైనప్పటికీ స్టైలింగ్ పరంగా, క్యారెక్టర్ పరంగా ఒకే రీతిలో ఉండటం వల్ల దీన్ని ఫ్రాంచైజీగా లెక్కిస్తున్నారు. 'బాఘి' 76.34 కోట్లు వసూలు చేస్తే, 'బాఘి 2' మూవీ అంతకు రెట్టింపుగా దేశంలో 164.38 కోట్ల రూపాయలను రాబట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



