షూటింగులకు తొందరపడి నిర్ణయాలు ఇవ్వలేం
on May 5, 2020

కరోనా ప్రభావం తెలుగు చలన చిత్ర పరిశ్రమ పైన తీవ్రంగా ఉంది. లాక్ డౌన్ వల్ల పరిశ్రమ పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పరంగా పరిశ్రమ సమస్యలు పరిష్కరించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే చర్చించామని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఒక్క నెల ఓపిక పట్టమని సినిమా వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవల తెలుగులో వినోదాత్మక చానళ్లకు చెందిన ప్రతినిధులు తలసానిని కలిశారు. కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకుంటామనీ, షూటింగులు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయనను కోరారు. కొందరు నిర్మాతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టు వినికిడి. అయితే... షూటింగుల విషయంలో తొందరపడి నిర్ణయాలు ఇవ్వలేమని ఈరోజు మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలోనూ థియేటర్లు, పరిశ్రమ నెలకొని ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వంతో కూడా చర్చిస్తామన్నారు.
కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున తదితర సినీ ప్రముఖులతో తలసాని సమావేశమైన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సరికొత్త నూతన విధానం రూపొందించామనీ, అది తీసుకు వద్దాం అనుకున్న సమయంలో కరోనా వచ్చిందని ఆయన అన్నారు. సినిమా పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలపై ఇండస్ట్రీ పెద్దల తో చర్చించామని, వీలైనంత త్వరగా కరోనాను కట్టడి చేసి యధావిధిగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు సాగించే విధంగా చర్యలు తీసుకుంటామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ముగించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



