కృష్ణంరాజు 'అమరదీపం' విడుదలై నేటికి సరిగ్గా 45 ఏళ్లు
on Sep 29, 2022
కృష్ణంరాజు నట జీవితంలో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటి.. 'అమరదీపం'. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ ముక్కోణ ప్రేమకథా చిత్రంలో కృష్ణంరాజు పోషించిన హరి ఉరఫ్ కృష్ణ అనే భగ్నప్రేమికుడి క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల్నీ అమితంగా మెప్పించింది. అందుకే 1977 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఆయనకు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించాయి. మలయాళం సినిమా 'థీక్కనాల్' (1976)కు ఇది రీమేక్.
ఇది హరి, శివప్రసాద్ అనే అన్నదమ్ములు, పార్వతి అనే అమ్మాయి కథ. చిన్నతనంలో ఒకరోజు శివ తమ ఫ్యామిలీ ఫొటోను పొరపాటున పగలగొట్టడంతో అతడిని కొట్టి, ఇంట్లోంచి పారిపోతాడు హరి. అతడిని ఒక స్మగ్లర్ పెంచుతాడు. హరి పేరును కృష్ణ అని మారుస్తాడు. స్మగ్లర్‌గా మారిన కృష్ణ విలాసాలకు అలవాటుపడటమే కాకుండా, తన సుఖానికి ఆడవాళ్లను వాడుకుంటూ ఉంటాడు. అలాంటివాడు పార్వతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కృష్ణ చెల్లెలు మాధవి ఫ్రెండ్. కృష్ణ ప్రేమను పార్వతి తిరస్కరిస్తుంది. కారణం.. అప్పటికే ఆమె, శివ ప్రేమలో ఉంటారు. ఈర్ష్యతో శివను చంపాలనుకుంటాడు కృష్ణ. కానీ అతను తన సొంత తమ్ముడనే విషయం గ్రహించి, శివ పార్వతులకు పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే పార్వతిని కృష్ణ ప్రేమిస్తున్నాడనే విషయం శివకు తెలుస్తుంది. పార్వతిని అతను సందేహిస్తాడు. దాంతో ఆత్మత్యాగానికి సిద్ధపడతాడు కృష్ణ.
ఇలాంటి బరువైన, సంఘర్షణాభరితమైన ప్రధాన పాత్రను కృష్ణంరాజు పోషించిన విధానం అపూర్వం. పార్వతిగా జయసుధ, శివప్రసాద్‌గా మురళీమోహన్ సైతం తమ పాత్రల్లో ఉన్నత స్థాయిలో రాణించారు. మాధవి, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, జయమాలిని, సారథి, సాక్షి రంగారావు, మాడా, రమాప్రభ ఇతర కీలక పాత్రలు చేశారు.
రాఘవేంద్రరావు దర్శకత్వం కూడా ఈ సినిమాను ఓ క్లాసిక్‌గా మార్చింది. జంధ్యాల రాసిన సంభాషణలు ఈ సినిమాకు ఇంకో బలం. సత్యం సంగీతం సమకూర్చిన పాటల్లో "అంతలేసి అందాలు" (ఆరుద్ర), "ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము" (ఆత్రేయ), "నా జీవన సంధ్యాసమయంలో" (వేటూరి), "ఏ రాగమో ఇది ఏ తాళమో" (ఆత్రేయ) అమితంగా సంగీత ప్రియులను అలరించి, వారి నాలుకలపై నర్తించాయి.
గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పించిన ఈ చిత్రాన్ని ఆయన తమ్ముడు యు.వి. సూర్యనారాయణరాజు నిర్మించారు. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం ఇదే తేదీన.. అంటే 1977 సెప్టెంబర్ 29న 'అమరదీపం' విడుదలైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
