45 వసంతాల `సిరి సిరి మువ్వ`!
on Dec 24, 2021
.webp)
అభినేత్రి జయప్రదలోని నటిని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒకరు. విశ్వనాథ్ రూపొందించిన `సిరి సిరి మువ్వ`, `సర్గమ్` (హిందీ), `సాగర సంగమం` చిత్రాలు జయప్రదకి నటిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చాయి. మరీముఖ్యంగా.. మూగ నృత్యకారిణిగా జయప్రద అభినయించిన `సిరి సిరి మువ్వ`.. ఆమె నటజీవితంలో ఓ ఆణిముత్యం. చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా.. పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు పొందింది. అలాగే, `ఉత్తమ గాయని`గా పి. సుశీలకి, `ఉత్తమ ఎడిటర్`గా కె. బాబురావుకి `నేషనల్ అవార్డ్స్`ని అందించింది. హిందీలో `సర్గమ్` పేరుతో ఈ చిత్రం రీమేక్ కాగా.. ఆ సినిమాతోనే జయప్రద హిందీనాట తొలి అడుగేయడం విశేషం.
దిగ్గజ స్వరకర్త కేవీ మహదేవన్ బాణీలు కట్టిన ఈ చిత్రానికి దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. పాటల్లో ``ఝుమ్మంది నాదం.. సై అంది పాదం`` విశేష ప్రజాదరణ పొందగా.. ``గజ్జె ఘల్లుమంటుంటే``, ``అందానికి అందం``, ``ఎవరికి ఎవరు ఈ లోకంలో``, ``రా దిగి రా దివి నుంచి`` వంటి గీతాలు కూడా రంజింపజేశాయి. కైకాల సత్యనారాయణ, కవిత, నిర్మలమ్మ, రమాప్రభ, దేవదాస్ కనకాల, జేవీ రమణమూర్తి, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జంధ్యాల సమకూర్చిన సంభాషణలు, వి.ఎస్. ఆర్. స్వామి అందించిన ఛాయాగ్రహణం అదనపు బలాలుగా నిలిచాయి. ఏడిద నాగేశ్వర రావు నిర్మించిన `సిరి సిరి మువ్వ`.. 1976 డిసెంబర్ 24న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ క్లాసిక్ 45 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



