కేవీ రెడ్డి చివరి చిత్రం `శ్రీకృష్ణ సత్య`కి 50 ఏళ్ళు!
on Dec 24, 2021

సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక.. ఇలా అన్ని జోనర్స్ లోనూ ఘనవిజయాలు చూసిన అరుదైన ఘనత మేటి దర్శకులు కేవీ రెడ్డిది. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుడిగా పేరుపొందిన కేవీ రెడ్డి.. తన 30 ఏళ్ళ దర్శకప్రస్థానంలో కేవలం 15 చిత్రాలకే పరిమితమయ్యారు. వాటిలో సింహభాగం నటరత్న నందమూరి తారక రామారావు కాంబినేషన్ లోనే చేశారాయన. అంతేకాదు.. `పాతాళ భైరవి` (1951)తో ఎన్టీఆర్ కి సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన కేవీ.. దర్శకుడిగా తన చివరి చిత్రమైన `శ్రీకృష్ణ సత్య`ని కూడా రామారావు కాంబినేషన్ లోనే రూపొందించడం విశేషం. `మాయాబజార్`, `శ్రీకృష్ణార్జున యుద్ధము` తరువాత కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి వేషంలో కనిపించిన మూడో చిత్రం `శ్రీకృష్ణ సత్య` కావడం మరో విశేషం. అంతేకాదు.. ఇందులో శ్రీకృష్ణుడిగానే కాకుండా శ్రీరాముడిగా, రావణుడిగానూ కనిపించి తన త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్.
Also Read:'విక్రమార్కుడు' హిందీ వెర్షన్‌కు సీక్వెల్ రాబోతోంది!
ఇక సత్యభామగా, చంద్రసేనగా ద్విపాత్రాభినయం చేసిన జయలలిత.. తన అద్భుత నటనతో `బెస్ట్ యాక్ట్రస్` విభాగంలో `ఫిల్మ్ ఫేర్` అవార్డును సొంతం చేసుకున్నారు. దుర్యోధనుడిగా, మహిరావణగా యస్వీ రంగారావు రెండు పాత్రలు పోషించిన ఈ చిత్రంలో దేవిక, కాంతారావు, చిత్తూరు నాగయ్య, రాజనాల, పద్మనాభం, ధూళిపాళ, మిక్కిలినేని, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆర్జా జనార్ధన రావు, త్యాగరాజు, ఎస్. వరలక్ష్మి, రుష్యేంద్రమణి, వై. విజయ, సంధ్యారాణి, చలపతి రావు ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పనలో రూపొందిన గీతాలన్ని ప్రజాదరణ పొందాయి. ఆర్.కె. బ్రదర్స్ పతాకంపై ఎన్. త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రానికి మార్కస్ బార్ట్ లే అందించిన ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్ కానుకగా 1971 డిసెంబర్ 24న విడుదలై జననీరాజనాలు అందుకోవడమే కాకుండా `ద్వితీయ ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారం కూడా సొంతం చేసుకున్న `శ్రీకృష్ణ సత్య`.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



