ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరి `మరో చరిత్ర`కి 44 ఏళ్ళు!
on May 19, 2022
తెలుగునాట ప్రేమకథల పరంగా విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన చిత్రంగా `మరో చరిత్ర`(1978)కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ విషాదాంత ప్రేమకథలో.. లోక నాయకుడు కమల్ హాసన్, సరిత జంటగా నటించారు. బాలు (కమల్ హాసన్) అనే తమిళ అబ్బాయికి, స్వప్న (సరిత) అనే తెలుగమ్మాయికి మధ్య సాగే ఈ ప్రణయ గాధ.. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టోరీగా నిలిచింది. ఆపై ఎన్నో ప్రేమకథలకు స్ఫూర్తిగా నిలిచిందీ ఎవర్ గ్రీన్ మూవీ. అంతేకాదు.. బాలు, స్వప్న అనే పేర్లు అనేక చిత్రాల్లో హీరోహీరోయిన్లకు క్యారెక్టర్ నేమ్స్ కావడం ఓ విశేషమనే చెప్పాలి. మాధవి, రమణ మూర్తి, కాకినాడ శ్యామల, పి.ఎల్. నారాయణ, జయవిజయ, మిశ్రో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్న ఈ సినిమాకి బీఎస్ లోక్ నాథ్ ఛాయాగ్రహణం ఓ ప్రత్యేకాకర్షణగా నిలిచింది.
ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతమందించిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ సాహిత్యమందించారు. ``భలే భలే మగాడివోయ్``, ``ఏ తీగ పూవునో``, ``కలిసి వుంటే కలదు సుఖం``, ``పదహారేళ్ళకు నీలో నాలో``, ``విధి చేయు వింతలన్నీ``.. ఇలా ఇందులోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. హిందీలో `ఏక్ దూజ్ కేలియే`, కన్నడలో `లవ్ స్టోరి`, ఒడియాలో `తు మేరి పేన్` పేర్లతో `మరో చరిత్ర` రీమేక్ అయింది. అలాగే, తెలుగులోనూ 2010లో అదే పేరుతో మరో వెర్షన్ గా తెరకెక్కింది. ఆండాళ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ అరంగణ్ణల్ నిర్మించిన `మరో చరిత్ర`.. 1978 మే 19న విడుదలై ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. కాగా, నేటితో ఈ సంచలన చిత్రం 44 వసంతాలు పూర్తిచేసుకుంది.
Also Read