'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో ఫ్రీగానే చూడొచ్చు
on May 19, 2022
మార్చి 25న విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా మే 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ఇటీవల 'జీ5' ప్రకటించింది. అయితే ఈ సినిమా చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తో పాటు పే పర్ వ్యూ విధానంలో అదనంగా చెల్లించాలని తెలిపింది. దీనిపై వీక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 'జీ5' దిగొచ్చింది.
వీక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి పే పర్ వ్యూ విధానాన్ని తొలగించి, సబ్‌స్క్రైబర్ లు అందరికీ 'ఆర్ఆర్ఆర్' మూవీని ఉచితంగా చూసే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తాజాగా 'జీ5' ప్రకటించింది. 'ఆర్ఆర్ఆర్' కోసం ఇప్పటికే అదనంగా చెల్లించిన సబ్‌స్క్రైబర్‌లకు.. మూడు నెలలు అదనపు కాలపరిమితి ఇస్తామని తెలిపింది. 'జీ5' నిర్ణయం పట్ల 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్ నుంచి సంతోషం వ్యక్తమవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధానపాత్రల్లో దర్శకుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేటర్లలో విడుదలై 50 రోజులు దాటింది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులకు కానుకగా 'జీ5' డిజిటల్ తెరపైకి ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ ను ప్రత్యేక బహుమతిగా వీక్షకులకు అందిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కూడా మే 20 నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
