'మగ మహారాజు'గా మెగాస్టార్ మురిపించి 39 ఏళ్ళు!
on Jul 15, 2022

మెగాస్టార్ చిరంజీవికి కలిసొచ్చిన దర్శకుల్లో విజయ బాపినీడు ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో `మగ మహారాజు` ఒకటి. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా సుహాసిని నటించగా.. ఉదయ్ కుమార్, రాళ్ళపల్లి, రావు గోపాల రావు, నిర్మలమ్మ, అన్నపూర్ణ, రోహిణి, తులసి, కె. విజయ, బాలాజీ, హేమ సుందర్, నూతన్ ప్రసాద్, థమ్, అనూరాధ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. అల్లు రామలింగయ్య అతిథి పాత్రలో మెరిశారు. ఆకెళ్ళ వెంకట సూర్య నారాయణ కథను అందించిన ఈ చిత్రానికి కాశీ విశ్వనాథ్ సంభాషణలు, ఎంవీ రఘు ఛాయాగ్రహణం అందించారు.
కృష్ణ - చక్ర స్వరాలు సమకూర్చిన `మగ మహారాజు`కి వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యమందించారు. ``నీ దారి పూల దారి``, ``సీతే రాముడి కట్నం``, ``మా అమ్మ చింతామణి``, ``అన్నలో అన్న``, ``నెలలు నిండే`` అంటూ సాగే ఇందులోని పాటలు ఆకట్టుకున్నాయి. శ్యాంప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన `మగ మహారాజు`.. 1983 జూలై 15న జనం ముందు నిలిచింది. కాగా, నేటితో ఈ ప్రజారంజక చిత్రం 39 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



