సుమన్ `దర్జా దొంగ`కి 37 ఏళ్ళు!
on Jun 14, 2022

అందాల నటుడు సుమన్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో `దర్జా దొంగ` ఒకటి. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మణివణ్ణన్ తీర్చిదిద్దిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కి సత్యరాజ్ కథను అందించడం విశేషం. సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, శ్రీధర్, మనోహర్, దీప, వరలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో సిల్క్ స్మిత, అనూరాధ ప్రత్యేక గీతాల్లో తమ చిందులతో కనువిందు చేశారు. మణివణ్ణన్ స్క్రీన్ ప్లే అందించగా.. సాయినాథ్ తోటపల్లి సంభాషణలు సమకూర్చారు. సభాపతి ఛాయాగ్రహణం అందించారు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు కట్టిన ఈ చిత్రానికి దిగ్గజ గీతరచయితలు వేటూరి సుందరరామ్మూర్తి, ఆత్రేయ సాహిత్యమందించారు. ఇందులోని ``చలి చలి``, ``హలో హలో చలాకి పిల్ల``, ``మనసుల గుస గుస``, ``నాలో చినుకులతో``, ``తప్పు కాదురా`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ విజయలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఆర్. రామకృష్ణంరాజు నిర్మించిన `దర్జా దొంగ`.. 1985 జూన్ 14న విడుదలైంది. కాగా, నేటితో ఈ చిత్రం 37 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



