రాజశేఖర్ సంచలన చిత్రం `అంకుశం`కి 33 ఏళ్ళు!
on Jul 13, 2022

కథానాయకుడిగా రాజశేఖర్ స్థాయిని పెంచిన చిత్రాల్లో `అంకుశం`కి ప్రత్యేక స్థానం ఉంది. గూండాలకు, రాజకీయ నాయకులకు సింహస్వప్నంలా గుండెల్లో నిలిచిన ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ కథే.. `అంకుశం` సినిమా. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ కాప్ డ్రామాలో రాజశేఖర్ కి జంటగా జీవిత నటించగా.. ప్రతినాయకుడి పాత్రలో రామిరెడ్డి (తొలి పరిచయం) అలరించారు. ఎమ్మెస్ రెడ్డి, బాబూ మోహన్, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ యూనిట్ కథను అందించగా.. ఎం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సత్యం స్వరాలు సమకూర్చిన `అంకుశం`కి మల్లెమాల సాహిత్యమందించారు. పాటల్లో ``ఇది చెరగని ప్రేమకు శ్రీకారం`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``గోరంత దీపం``, ``అయ్యలూ జాగ్రత్త``, ``చిన్నారి`` (ద్విపద), ``నేను తప్పు చేయలేదు`` గీతాలు కూడా ఆకట్టుకున్నాయి. `ఉత్తమ ప్రతినాయకుడు` (రామిరెడ్డి), `ఉత్తమ కథా రచయిత` (ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ యూనిట్), `ఉత్తమ గీత రచయిత` (ఎమ్మెస్ రెడ్డి) విభాగాల్లో `నంది` పురస్కారాలను దక్కించుకున్న `అంకుశం`ని.. హిందీలో `ప్రతిబంధ్` (మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ బాలీవుడ్ మూవీ), కన్నడంలో `అభిమన్యు` (రవిచంద్రన్) పేర్లతో దర్శకుడు రవిరాజా పినిశెట్టి రీమేక్ చేశారు. అదేవిధంగా.. తమిళంలో `ఇదుదాండ పోలీస్` టైటిల్ తో అనువాదమైన `అంకుశం` అక్కడ కూడా మంచి విజయం సాధించింది. కాగా, 1989 జూలై 13న విడుదలై సంచలనం సృష్టించిన `అంకుశం`.. నేటితో 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



