'ఉత్తమనటుడు' చిరంజీవి 'ఆపద్బాంధవుడు' విడుదలై నేటికి సరిగ్గా 30 ఏళ్లు
on Oct 9, 2022

మెగాస్టార్ చిరంజీవి చేసిన చక్కని కుటుంబ కథాచిత్రాల్లో ఒకటి 'ఆపద్బాంధవుడు' (1992). రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల మధ్య అప్పుడప్పుడైనా తనలోని నటుడ్ని సంతృప్తిపర్చే కథలను చేయాలని చిరంజీవి తపించేవారు. కళాతపస్వి కె. విశ్వనాథ్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే మిగతా సినిమాలను పక్కనపెట్టడానికి ఆయన సంకోచించలేదు. అలా ఆయన చేసిన సినిమాయే 'ఆపద్బాంధవుడు'. ఈ మూవీలో చేసిన మాధవరావు పాత్ర ఆయనకు ఎంతో పేరు తేవడమే కాకుండా, ఉత్తమ నటునిగా నంది అవార్డును సాధించి పెట్టింది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా అప్పటి హిందీ చిత్రాల అగ్ర తారల్లో ఒకరైన మీనాక్షి శేషాద్రి నటించగా, ఆమె తండ్రిగా రచయిత-దర్శకుడు జంధ్యాల చేశారు. పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
'సాగర సంగమం' తర్వాత కె. విశ్వనాథ్ చిత్రానికి జంధ్యాల మాటలు రాసింది మళ్లీ ఈ సినిమాకే. కథలో కీలకమైన ఉపాధ్యాయుడు పరంధామరాజు పాత్రను కోరి మరీ చేశారు జంధ్యాల. మేకప్ టెస్ట్ చేసి ఆయనను ఓకే చేశారు విశ్వనాథ్. డాన్సుల్లో చిరంజీవికి సమవుజ్జీ కావాలనే ఉద్దేశంతో హీరోయిన్ హేమ పాత్రకు చక్కని డాన్సర్ అయిన మీనాక్షి శేషాద్రిని ఎంపిక చేశారు. ఈ సినిమా సంగీత ముహూర్తం 1992 ఏప్రిల్ 8న మద్రాస్‌లోని ఏవీయం థియేటర్లో జరగగా, అదే రోజు విశ్వనాథ్‌కు రఘుపతి వెంకయ్య అవార్డుని ప్రకటించడం ఓ విశేషం.
రాజమండ్రికి సమీపాన గోదావరి తీరప్రాంతంలో ఉన్న పూడిపల్లి అనే ఊళ్లో 20 రోజుల పాటు షూటింగ్ జరిపారు. చిత్రంలోని ఓపెనింగ్ సీన్స్‌ను తమిళనాడు-కేరళ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుట్రాళం-పూనబార్ రైలు మార్గంలో తీశారు. ట్రైన్‌పైన తీసిన ఫైట్ సీన్స్‌ను డూప్‌కు తావివ్వకుండా తానే స్వయంగా చిరంజీవి చేశారు. ప్రి క్లైమాక్స్‌లో చిరంజీవి చర్చిపై నుంచి శిలువ పట్టుకొని తలకిందులుగా వేలాడే సన్నివేశాన్ని సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో తీశారు.
ఒక ఊరిలో పశువులను కాచుకుంటూ పాల వ్యాపారం చేసుకొనే మాధవరావు కథ 'ఆపద్బాంధవుడు'. ఆ ఊరికి పెద్ద దిక్కు పరంధామరాజు మంచి కవి. ఆయన చిన్నకూతురు హేమకు మాధవుడుంటే ప్రేమ. ఆమె అంటే అతనికి అమితమైన గౌరవం. పరంధామరాజు రాసిన కవితలను పుస్తకంగా ముద్రించడం కోసం కావాల్సిన డబ్బు కోసం తన పశువుల్ని అమ్మేస్తాడు మాధవుడు. దాంతో అతడినే తన పుస్తకానికి కృతిభర్తగా అంకితమిస్తాడు పరంధామరాజు. ఆ ఆనందంలోనే ఆయన కన్నుమూస్తాడు. గర్భవతి అయిన అక్కకు తోడుగా ఉండాలని వెళ్లిన హేమను బలాత్కరించబోతాడు బావ. ఆ క్రమంలో హేమకు మతి చలిస్తుంది. పిచ్చాసుపత్రిలో ఉన్న హేమను కలుసుకోవడం కోసం తననూ పిచ్చివాడిగా నమ్మించి అక్కడ చేరతాడు మాధవ. ఆమెను కంటిపాపలా కాపాడుతూ, మామూలు మనిషిని చేసి, తన జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు.
సుమారు రూ. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, శరత్‌బాబు, గీత, నిర్మలమ్మ, బ్రహ్మానందం, అరుణ్‌కుమార్, కల్పనారాయ్, విజయచందర్, సుత్తివేలు లాంటి పలువురు తారలు నటించారు. ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేదు కానీ, చక్కని కుటుంబ కథాచిత్రంగా, మ్యూజికల్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కీరవాణి స్వరాలకు సి. నారాయణరెడ్డి, సీతారామశాస్త్రి, భువనచంద్ర, మాడుగుల నాగఫణిశర్మ సమకూర్చిన సాహిత్యంతో వచ్చిన పాటలు ఆదరణ పొందాయి. 'ఔరా అమ్మకు చెల్లా', 'పువ్వూ నవ్వే గువ్వా నవ్వే', 'చుక్కల్లారా చూపుల్లారా', 'ఒడి ఒడి ఒడియప్పా' పాటలు ఎక్కడ చూసినా వినిపించాయి. అన్ని పాటలనూ ఎస్పీ బాలసుబ్రహ్మణం, చిత్ర పాడారు.
విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొనడం 'ఆపద్బాంధవుడు'కు ప్రతికూలకంగా మారాయి. 'ఘరానా మొగుడు' లాంటి బ్లాక్‌బస్టర్ మాస్ సినిమా తర్వాత చిరంజీవి నుంచి ఇలాంటి సాఫ్ట్ ఫిల్మ్ రావడంతో అభిమానులు నిరాశచెందారు. అయితే అవార్డులు ఆ లోటును పూడ్చాయి. అదివరకు 'స్వయంకృషి'తో ఉత్తమనటుడిగా నంది అవార్డు అందుకున్న చిరంజీవి.. మరోసారి అదే కె. విశ్వనాథ్-ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్‌తో వచ్చిన 'ఆపద్బాంధవుడు'తో నంది అవార్డు అందుకున్నారు. అది కాకుండా ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ సహాయనటుడు (జంధ్యాల), ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ కళాదర్శకుడు అవార్డులు లభించాయి. 1992 అక్టోబర్ 9న అంటే సరిగ్గా 30 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఉత్తమ చిత్రం 'ఆపద్బాంధవుడు'.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



