జగపతి బాబు `ఒక చిన్న మాట`కి పాతికేళ్ళు!
on May 27, 2022
సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ గా తెలుగునాట ప్రత్యేక గుర్తింపు పొందారు ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. ఆయన రూపొందించిన సినిమాల్లో సింహభాగం విజయపథంలో పయనించాయి. వాటిలో `ఒక చిన్న మాట` ఒకటి. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 1906 నాటి నవల `నౌకదుబి` ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఇంద్రజ జంటగా నటించగా.. సత్యనారాయణ, రాజీవ్ రాయ్, బ్రహ్మానందం, బాబూ మోహన్, మల్లికార్జునరావు, ఏవీయస్, చలపతి రావు, సుత్తి వేలు, రఘునాథ రెడ్డి, కళ్ళు చిదంబరం, రక్ష, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, బెంగుళూరు పద్మ, రాగిణి, రమ్యశ్రీ, వై. విజయ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. దివాకర్ బాబు ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు.
రమణి భరద్వాజ్ స్వరకల్పనలో రూపొందిన గీతాలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, భువన చంద్ర సాహిత్యమందించారు. ఇందులోని ``ఓ మనసా తొందరపడకే``, ``కుర్రకారు పూజించే``, ``ము ము ము ముద్దిస్తా మెత్తగా``, ``మధురము కదా``, ``ప్రతి ఒకరికి తొలి వలపున``, ``ఎవరిని చూస్తూ ఉన్నా`` అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మించిన `ఒక చిన్న మాట`.. 1997 మే 27న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
