ENGLISH | TELUGU  

'ఎఫ్ 3' మూవీ రివ్యూ

on May 27, 2022

 

సినిమా పేరు: ఎఫ్ 3
తారాగ‌ణం: వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ పిర్జాడా, సునీల్, ర‌ఘుబాబు, ముర‌ళీశ‌ర్మ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సంప‌త్ రాజ్‌, సోనాల్ చౌహాన్‌, అలీ, తుల‌సి, గోప‌రాజు ర‌మ‌ణ‌, ప్ర‌గ‌తి, ప్ర‌దీప్‌, స‌త్యా, అన్న‌పూర్ణ‌, వై. విజ‌య‌, వెన్నెల కిశోర్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, పృథ్వీ, స్ట‌న్ శివ‌, పూజా హెగ్డే (స్పెష‌ల్ అప్పీరెన్స్‌)
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు: అనిల్ రావిపూడి
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, కాస‌ర్ల శ్యామ్‌, శ్రీ‌మ‌ణి
సంగీతం: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీ‌రామ్‌
ఎడిటింగ్: త‌మ్మిరాజు
ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్: ఎ.ఎస్‌. ప్రకాశ్‌
నిర్మాత: శిరీష్‌
స‌మ‌ర్ప‌ణ: దిల్ రాజు
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ రావిపూడి
బ్యాన‌ర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 27 మే 2022

2019లో సంక్రాంతికి వ‌చ్చి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించిన‌ 'ఎఫ్ 2' మూవీకి సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపొందుతోంద‌నే స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచీ, ఈ మూవీ కోసం అత్యంత ఆత్రుత‌తో ఎదురుచూస్తూ వ‌చ్చారు ప్రేక్ష‌కులు. వెంక‌టేశ్‌-త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌-మెహ్రీన్ పిర్జాడా జంట‌ల‌ను కొన‌సాగిస్తూ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'ఎఫ్ 3' మూవీ ట్రైల‌ర్ రిలీజైన‌ప్పుడు.. ఆ రెండు నిమిషాల వీడియోకే జ‌నం ప‌డీ ప‌డీ న‌వ్వారు. ట్రైల‌రే అంత‌గా న‌వ్వించిందంటే, మొత్తం సినిమా ఇంకే రేంజ్‌లో న‌వ్విస్తుందోన‌ని అంతా అనుకున్నారు.

క‌థ‌
రేచీక‌టి ఉండే వెంకీ (వెంక‌టేశ్‌) ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పెద్ద కొడుకుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుంటాడు. అత‌డు ర‌ఘుబాబుతో క‌లిసి ర‌క‌ర‌కాల బ్రోక‌ర్ ప‌నులు చేస్తుంటాడు. అవి రివ‌ర్స్ అవుతుంటాయి. న‌త్తి న‌త్తిగా మాట్లాడుతుంటే వ‌రుణ్ యాద‌వ్ (వ‌రుణ్ తేజ్‌) ఓ అనాథ‌. ఈజీగా డ‌బ్బు సంపాదించ‌డం కోసం త‌న మావ (సునీల్‌)తో క‌లిసి ర‌క‌ర‌కాల స్కెచ్‌లు వేస్తూ, అభాసు పాల‌వుతుంటాడు. త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డం కోసం ఎప్ప‌టిక‌ప్పుడు మాయ‌మాట‌లు చెప్పి వెంకీ ద‌గ్గ‌ర త‌ర‌చూ డ‌బ్బులు గుంజుతుంటుంది హారిక (త‌మ‌న్నా). వాళ్ల‌ది పునుగులు అమ్ముకుంటూ బ‌తికే ఫ్యామిలీ. హారిక చెల్లెలు హ‌నీ (మెహ్రీన్ పిర్జాడా) డ్ర‌స్‌, ఆమె బాడీ లాంగ్వేజ్ చూసి పెద్ద మిలియ‌నీర్ కూతుర‌నుకొని, ఆమెను ఎలాగైనా ప్రేమ‌లో ప‌డేసి, పెళ్లి చేసుకుంటే మిలియ‌నీర్ అయిపోవ‌చ్చ‌ని క‌ల‌లు కంటాడు వ‌రుణ్‌. త‌నూ మిలియ‌నీర్‌లా బిల్డ‌ప్ ఇస్తాడు. నిజ‌మే అనుకొని, త‌న లైఫ్ సెటిల్ అయిపోతుంద‌ని ప్రేమిస్తున్న‌ట్లు న‌టిస్తుంది హ‌నీ. చివ‌ర‌కు ఇద్ద‌రి బండార‌మూ ప‌ర‌స్ప‌రం తెలిసిపోతుంది. అంత‌లో విజ‌య‌న‌గ‌రానికి చెందిన జె.కె. ఇండ‌స్ట్రీస్ అధినేత ఆనంద‌ప్ర‌సాద్ (ముర‌ళీశ‌ర్మ‌) త‌న కొడుకు 20 ఏళ్ల క్రితం త‌ప్పిపోయాడ‌నీ, అత‌ను వ‌స్తాడ‌ని న‌మ్మ‌కంతో ఎదురుచూస్తున్నాన‌నీ మీడియాలో చెప్తాడు. దాంతో వెంకీ, వ‌రుణ్, హారిక‌, నాగ‌రాజు ఎవ‌రికి వారు మ‌రొక‌రికి చెప్ప‌కుండా త‌మ ప్లాన్‌లో భాగంగా విజ‌య‌న‌గరంకు వెళ్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అనేది తెర మీద చూడాలి.

విశ్లేష‌ణ‌
'ఎఫ్ 2'కు సీక్వెల్ కాబ‌ట్టి క‌చ్చితంగా దాంతో 'ఎఫ్ 3'కి పోలిక వ‌స్తుంది. 'ఎఫ్ 3' అనేది సీక్వెల్ అయినా మొద‌టి సినిమా క‌థ‌కూ, ఈ సినిమా క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. క్యారెక్ట‌ర్ల పేర్లు మాత్ర‌మే రిపీట్ అయ్యాయి. మొద‌టి సినిమా ఫ్యామిలీలో జ‌రిగే గొడ‌వ‌లు, మొగుడూ పెళ్లాల కీచులాట‌లు ఇలాంటి వాటి మీద న‌డిచి అల‌రించింది, న‌వ్వించింది. 'ఎఫ్ 3' క‌థ మొత్తం డ‌బ్బు చుట్టూ న‌డుస్తుంది. డ‌బ్బున్న వాడికి ఫ‌న్‌, లేనివాడికి ఫ్ర‌స్ట్రేష‌న్ అనే పాయింట్ మీద ఈ సినిమా క‌థ‌ను అల్లాడు. డ‌బ్బు కోసం ఏ గ‌డ్డి తిన‌డానికైనా మ‌నుషులు రెడీ అయిపోతుంటార‌నీ, ఈజీ మ‌నీ కోసం ఏం చెయ్య‌డానికైనా వెనుకాడ‌ర‌నీ ఈ సినిమాలో మ‌న‌కు చూపించే ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.  డ‌బ్బును గౌర‌వించాల‌నీ, నిజాయితీతో, క‌ష్టంతో దాన్ని సంపాదించాల‌నే సందేశం కూడా ఓ పాత్ర ద్వారా ఇచ్చాడు. 

ఒక విష‌యం మాత్రం అర్థం కాలేదు. వెంకీ, వ‌రుణ్ మ‌ధ్య బంధుత్వం ఏమీ ఉండ‌దు. ఒక‌రినొక‌రు తెలిసిన‌వాళ్లు. అంతే! వ‌రుణ్‌ ఒక డ‌బ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, దాని ద్వారా అత‌డికొచ్చే డ‌బ్బులో త‌మ‌కూ వాటా వ‌స్తుంద‌ని వెంకీ అనుకోవ‌డం, దాని కోసం త‌మ ఇల్లు సైతం తాక‌ట్టు పెట్టి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు అప్పులు తేవ‌డం ఏమిటి! ఒక డబ్బున్న వాళ్లింట్లో ప‌నిమ‌నిషిగా చేసే హ‌నీ, ఆ ఇంటి య‌జ‌మానురాలి కూతురు బ‌ట్ట‌లు వేసుకొని బ‌య‌ట తిర‌గ‌డం ఏమిటి, ఆమెను డ్రైవ‌ర్ చాలా చీప్‌గా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ వెంకీ, వ‌రుణ్ ఆమె ఎవ‌రో గుర్తించ‌లేక‌పోవ‌డం ఏమిటి?  లాంటి లాజిక్‌లెస్ విష‌యాలపై మ‌నం దృష్టి పెట్ట‌కూడ‌దు. ఎందుకంటే ఇది కామెడీ సినిమా అండీ!

వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, ర‌ఘుబాబు, సునీల్‌, అలీ, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యా క‌నిపించిన ప్ర‌తిసారీ మ‌న‌ల్ని న‌వ్విస్తారు. కానీ అందుకోసం క‌ల్పించిన స‌న్నివేశాలే అతిగా అనిపిస్తాయి. బ‌ల‌వంతంగా మ‌న మీద రుద్దుతున్న‌ట్లు అనిపిస్తాయి. డ‌బ్బు కోసం మ‌నిషి నానా గ‌డ్డీ తింటాడ‌ని చెప్ప‌డానికి అనిల్ రావిపూడి రాసుకున్న‌ క‌థ దారి త‌ప్పింద‌నిపిస్తుంది. అందుకే మ‌నం ఆ సీన్లు చూసి న‌వ్వుకుంటాం కానీ, ఆ పాత్ర‌ల‌తో మ‌నం స‌హానుభూతి చెందం. 'ఎఫ్ 3'కి సంబంధించిన మెయిన్ డ్రాబ్యాక్ పాయింట్ ఇదే. క్యారెక్ట‌ర్స్‌తో, ఇన్సిడెంట్స్‌తో ఆడియెన్స్ క‌నెక్ట్ అయితే ఆ సినిమా ఓ రేంజ్‌కు వెళ్లిపోతుంది. క‌నెక్ట్ కాక‌పోతే.. జ‌స్ట్ న‌వ్వుకోడానికి, రెండున్న‌ర గంట‌ల‌సేపు ఓసారి కాల‌క్షేపం చెయ్య‌డానికి ప‌నికొచ్చే సినిమాగా మిగిలిపోతుంది. 'ఎఫ్ 2' మొద‌టి ర‌కం సినిమా అయితే, 'ఎఫ్ 3' రెండో ర‌కం సినిమా. క‌థ విజ‌య‌న‌గ‌రం వెళ్లాక వ‌చ్చే సీన్లయితే మ‌రీ ఓవ‌ర్‌గా అనిపిస్తుంటాయి. అక్క‌డ ఎలాంటి సీన్లు క‌ల్పించాల‌నే విష‌యంలో అనిల్ మ‌రింత శ్ర‌ద్ధ చూపిస్తే బాగుండేది.

దేవి శ్రీ‌ప్ర‌సాద్ మ్యూజిక్ పాట‌ల విష‌యంలో ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలో ఉంది. పూజా హెగ్డేపై తీసిన స్పెష‌ల్ సాంగ్ మాస్ ఆడియెన్స్‌ను అల‌రిస్తుంది. పాట‌ల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బెట‌ర్‌. సాయిశ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఎక్స‌లెంట్‌. త‌న చేతికిచ్చిన స‌న్నివేశాల్ని క‌త్తిరించ‌డంలో, అతికించ‌డంలో ఎడిట‌ర్‌ త‌మ్మిరాజు చాలా శ్ర‌మ‌ప‌డ్డాడు. ఎ.ఎస్‌. ప్ర‌కాశ్ ఆర్ట్ వ‌ర్క్‌కు వంక పెట్ట‌లేం. చివ‌ర‌లో 'ఎఫ్ 4' వ‌స్తుంద‌ని తెర‌మీద క‌నిపించి మ‌రీ ప్ర‌క‌టించాడు డైరెక్ట‌ర్ అనిల్‌. దాని కోసం జ‌నం కుతూహ‌లంతో ఎదురుచూస్తారా?

న‌టీన‌టుల ప‌నితీరు
వెంకీ పాత్ర‌లో వెంక‌టేశ్ చెల‌రేగిపోయి చేశాడు. ఇప్ప‌టికే ఓ సారి ఆ క్యారెక్ట‌ర్‌ను చేసుండ‌టం వ‌ల్ల, ఇప్పుడు మ‌రింత సునాయాసంగా ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి తెగ న‌వ్వించాడు. రేచీక‌టి సీన్ల‌లో ప‌డీ ప‌డీ న‌వ్వుకుంటాం. వ‌రుణ్ యాద‌వ్ క్యారెక్ట‌ర్‌ను వ‌రుణ్ తేజ్ మొద‌టిసారి కంటే ఇప్పుడు మ‌రింత ప‌రిణ‌తితో ర‌క్తి క‌ట్టించాడు. న‌త్తి మేన‌రిజ‌మ్‌ను అత‌ను ప్ర‌ద‌ర్శించే తీరు తెగ న‌వ్విస్తుంది. కానీ రెండో కోణంలో చూస్తే ఒక శారీర‌క లోపాన్ని అంత‌గా అప‌హాస్యం చేయాలా అనిపిస్తుంది. హారిక‌, హ‌నీ పాత్ర‌లను సొంతం చేసుకొని న‌టించారు త‌మ‌న్నా, మెహ్రీన్. ఇద్ద‌రూ అందంలో ఒక‌రికొక‌రు పోటీప‌డేట్లు ఉన్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, సునీల్‌, వెన్నెల కిశోర్‌, అలీ, స‌త్యా, ప్ర‌గ‌తి న‌వ్వించారు. సోనాల్ చౌహాన్‌, తుల‌సి, గోప‌రాజు ర‌మ‌ణ‌, ప్ర‌దీప్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, పృథ్వీ, అన్న‌పూర్ణ‌, వై. విజ‌య‌ పాత్ర‌ల ప‌రిధుల మేర‌కు న‌టించారు. ఆనంద‌ప్ర‌సాద్‌గా కీథ‌కు కీల‌క‌మైన పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ గొప్ప‌గా రాణించ‌గా, నెగ‌టివ్ రోల్‌లో సంప‌త్ రాజ్ మెప్పించాడు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
'ఎఫ్ 2' అంత హాయిగా, స‌హ‌జంగా 'ఎఫ్ 3' న‌వ్వించ‌దు. కానీ రెండున్న‌ర గంట‌ల సేపు ఓసారి కాల‌క్షేపం చేద్దామ‌నుకొనే వాళ్లు 'ఎఫ్ 3'కి వెళ్లొచ్చు. ఈ సినిమా చూస్తూ కూడా మ‌నం న‌వ్వుతాం. అదే స‌మ‌యంలో ఆ నవ్వుల‌కు కార‌ణ‌మైన సీన్లు చాలా ఓవ‌ర్‌గా ఉన్నాయ‌ని ఫీల‌వుతాం. వాటితో మ‌నం క‌నెక్ట్ కాలేం.

రేటింగ్: 2.75/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.