`తమ్ముడు`గా పవన్ పలకరించి నేటికి 23 ఏళ్ళు!
on Jul 15, 2022

కథానాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచిన చిత్రాల్లో `తమ్ముడు`కి ప్రత్యేక స్థానం ఉంది. `తొలిప్రేమ` (1998) వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ నుంచి వచ్చిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ `జో జీతా వహీ సికందర్` (1992) స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాతో పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఇదే చిత్రంతో కథానాయికలు ప్రీతి జింగానియా, అదితి గోవిత్రీకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి అన్నయ్యగా అచ్యుత్ నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రాజాకృష్ణమూర్తి, భూపేందర్ సింగ్, అలీ, బ్రహ్మానందం, చంద్రమోహన్, వెన్నిరాడై మూర్తి, మల్లికార్జునరావు, వేణుమాధవ్, ఐరెన్ లెగ్ శాస్త్రి, మాధవిశ్రీ (వర్ష) ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
రమణ గోగుల స్వరకల్పనలో రూపొందిన పాటలకు `సిరివెన్నెల` సీతారామశాస్త్రి, చంద్రబోస్, సురేంద్ర కృష్ణ, రమణ గోగుల సాహిత్యమందించారు. ``మేడిన్ ఆంధ్రా``, ``పెదవి దాటని``, ``వయ్యారి భామ``, ``ట్రావెలింగ్ సోల్జర్``, ``ఏదోలా ఉంది``, ``కలకలలు`` - ఇలా ఇందులోని గీతాలన్ని యువతరాన్ని ఉర్రూతలూగించాయి. తమిళంలో `బద్రి` (విజయ్, భూమిక, మోనాల్), కన్నడంలో `యువరాజా` (శివరాజ్ కుమార్, లీసారే, భావనా పాణి), బెంగాలీలో `ఛాంపియన్` (జీత్, స్రబంతి ఛటర్జీ, సందిత ఛటర్జీ) పేర్లతో రీమేక్ అయిన `తమ్ముడు`ని.. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు. 1999 జూలై 15న విడుదలై ఘనవిజయం సాధించిన `తమ్ముడు`.. నేటితో 23 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



