అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ ఇయర్‌గా మిగిలిన 2022!
on Dec 30, 2022

ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ ఇయర్ అని చెప్పాలి. 2022 అక్కినేని హీరోలకు అసలు కలిసి రాలేదు. సంవత్సరం మొదట్లో నాగార్జున, నాగచైతన్య కలిసి 'బంగార్రాజు' అంటూ ఓ మోస్తరు హిట్ ని అందుకున్నా సరే.. ఏడాది మొత్తంగా విశ్లేషిస్తే వీరికి చేదు అనుభవమే మిగిలింది. నాగ చైతన్య నటించిన 'థాంక్యూ' చిత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఇక నాగార్జున చేసిన 'ది ఘోస్ట్' మూవీ డిజాస్టర్ అయ్యింది. నాగార్జున బిగ్ బాస్ సీజన్-6 కి హోస్టుగా చేశారు. ఐదు సీజన్లలో బాగానే నడిచిన ఈ షో.. ఆరో సీజన్లో చతికిలబడింది. మునుపటి సీజన్లతో పోలిస్తే టీఆర్పీలు దారుణంగా పడిపోయాయి. సీజన్ జరుగుతున్నప్పుడు కూడా హడావుడి ఏమీ లేదు. దీంతో తదుపరి సీజన్ బిగ్ బాస్ 7 నుంచి నాగార్జున తప్పుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని కూడా ప్రచారంలోకి వచ్చింది. అలా నాగార్జునకు ఈ ఏడాది తీవ్రమైన నిరాశను మిగిల్చింది.
ఇక అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమా కనీసం ఏడాది చివర్లో అయినా విడుదలవుతుందని అక్కినేని అభిమానులు ఎదురు చూశారు. కానీ రీషూట్లతో కాలం గడుపుతూ.. విడుదల తేదీ వాయిదా పడుతూనే వస్తోంది. సినిమా క్వాలిటీ పరంగా పర్ఫెక్ట్ గా రావాలని అక్కినేని కుటుంబం పట్టుదలగా ఉండటంతో దర్శకుడు సురేందర్ రెడ్డి పలు సన్నివేశాలను రీషూట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ ఏడాది విడుదల అనుకున్న ఈ సినిమా 2023కి వాయిదా పడింది. బహుశా జనవరి చివరిలో గాని ఫిబ్రవరిలో గాని వస్తుందంటున్నారు. మరి అప్పుడైనా విడుదలవుతుందా లేక అప్పుడు కూడా వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో విజయాన్ని అందుకున్న అఖిల్.. 2022లో 'ఏజెంట్'తో హిట్ కొడతాడు అనుకోగా అది 2023కి వాయిదా పడింది.
మొత్తంగా ఈ ఏడాది అక్కినేని హీరోలకు కలిసి రాలేదు. అంతేగాక అక్టోబర్ ఆరంభంలో నాగచైతన్య, సమంత తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల తనకు ఓ తీవ్రమైన వ్యాధి ఉందని చెప్పి సమంత షాకిచ్చింది. సమంత అనారోగ్యం పాలవ్వడం కూడా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ అయ్యేలా చేసింది.
మొత్తానికి 'బంగార్రాజు' తప్ప ఈ ఏడాదిలో అక్కినేని ఫ్యామిలీకి ఏమీ కలిసి రాలేదు. మరి వచ్చే ఏడాదైనా ఈ కుటుంబానికి మంచి రోజులు వస్తాయని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2023లోది అఖిల్ 'ఏజెంట్'గా వస్తుండగా, నాగచైతన్య 'కస్టడీ'తో వస్తున్నాడు. మరోవైపు నాగార్జున 'ధమాకా' చిత్రానికి కథ, సంభాషణలను అందించిన ప్రసన్నకుమార్ బెజవాడను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్నాడు. గతంలో నాగార్జున పలువురు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి మంచి ఫలితాలను అందుకున్నాడు. అటు వారిని దర్శకులుగా నిలబెట్టడమే కాకుండా, తాను కూడా హీరోగా హిట్లనందుకున్నాడు. మరి ప్రసన్నకుమార్ బెజవాడ కూడా వారి బాటలో పయనించి నాగార్జునకు హిట్ ఇచ్చి, తాను కూడా దర్శకునిగా తెరంగేట్రంతోనే హిట్ అందుకుంటాడా లేదా అనేది వచ్చే ఏడాది గాని మనకు తెలియదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



