విక్రమ్ 'అపరిచితుడు'కి 17 ఏళ్ళు!
on Jun 17, 2022
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ స్థాయిని పెంచిన చిత్రాల్లో 'అపరిచితుడు' ఒకటి. తమిళ సినిమా 'అన్నియన్'కి తెలుగు అనువాద రూపంగా సందడి చేసిన ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించారు. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్' అనే పాయింట్ తో శంకర్ అల్లుకున్న ఈ సోషల్ డ్రామాలో రామానుజం, రెమో, అపరిచితుడు - ఇలా మూడు ఛాయలున్న పాత్రలో విక్రమ్ నటన సినిమాకి ఎస్సెట్ గా నిలిచింది.
సదా కథానాయికగా నటించిన ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రకాశ్ రాజ్, నెడుముడి వేణు, వివేక్, నాజర్, కొచ్చిన్ హనీఫా, చార్లి, సౌరభ్ శుక్లా, బేబి దివ్య నగేశ్, మనోబాల ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వగా.. "రెమో" సాంగ్ లో యానా గుప్తా తన గ్లామర్ తో కనువిందు చేసింది.
హేరిస్ జైరాజ్ బాణీలు కట్టిన ఈ చిత్రంలో.. "నీకు నాకు నోకియా", "లవ్ ఎలిఫెంట్ లా" (రెమో సాంగ్), "జియంగారి", "ఓ సుకుమారి", "కొండ కాకి" అంటూ మొదలయ్యే పాటలన్నీ ఆకట్టుకున్నాయి. 'బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్' (టాటా ఎలెక్సి) విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్న 'అన్నియన్'.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీత రచయిత (వైరముత్తు), ఉత్తమ కళా దర్శకుడు (సాబు సిరిల్), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం (రవివర్మన్, వి. మణికందన్), బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ (పీటర్ హెయిన్) విభాగాల్లో 'ఫిల్మ్ ఫేర్' (తమిళ్) అవార్డులను సొంతం చేసుకుంది.
ఆస్కార్ ఫిలింస్ పతాకంపై వి. రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం.. 2005 జూన్ 17న విడుదలై ఘనవిజయం సాధించింది. నేటితో ఈ సినిమా 17 వసంతాలను పూర్తిచేసుకుంది.
కాగా, ఇప్పుడిదే చిత్రాన్ని రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా బాలీవుడ్ లో రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు శంకర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
