సినిమా పేరు: ఊర్వశివో రాక్షసివో
తారాగణం: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, ఆమని, కేదార్ శంకర్, పృథ్వి, పోసాని కృష్ణ మురళి
సంగీతం: అచు రాజమణి
సినిమాటోగ్రఫీ: తన్వీర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్, విజయ్
దర్శకత్వం: రాకేష్ శశి
బ్యానర్: జీఏ2 పిక్చర్స్
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
'గౌరవం'(2013) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అల్లు శిరీష్ ఈ తొమ్మిదేళ్లలో హీరోగా ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. భారీ సక్సెస్ లు అందుకొని తన అన్నయ్య అల్లు అర్జున్ లా స్టార్ కాలేకపోయాడు కానీ పర్లేదు ఇతని సినిమాలు అంతో ఇంతో బాగానే ఉంటాయనే పేరు తెచ్చుకున్నాడు. తాజాగా 'ఊర్వశివో రాక్షసివో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2018లో విడుదలైన తమిళ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'ప్యార్ ప్రేమ కాదల్'కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా అదే స్థాయిలో మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:- మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్(శిరీష్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తన పక్క కంపెనీలో పనిచేసే సింధూజ(అను ఇమ్మానుయేల్)ను ఇష్టపడుతూ, ఆమెను దూరం నుంచే చూసి ఆనందపడుతుంటాడు. సింధుతో ఎలాగైనా మాట్లాడాలని శ్రీ ఎదురుచూస్తుండగా.. అనుకోకుండా ఆమే వచ్చి శ్రీ పని చేస్తున్న కంపెనీలో చేరుతుంది. ఇక సింధుని మెప్పించడానికి శ్రీ రకరకాల విన్యాసాలు చేసి ఆమెకు బాగా దగ్గరై పీకల్లోతు ప్రేమలో పడతాడు. సింధు కూడా అతనితో బాగా చనువుగా ఉంటుంది. అయితే ఇద్దరూ అనుకోకుండా ఒకసారి శారీరికంగా కలుస్తారు. అదే సమయంలో శ్రీ తన మనసులో మాట చెప్తాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని శ్రీ చెప్పగా.. "ప్రేమ ఏంటి?.. పెళ్లి ఏంటి?.. మనం మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది" అని చెప్పి సింధు షాకిస్తుంది. ప్రేమించిన అమ్మాయి అలా అనేసరికి శ్రీ ఏం చేశాడు? శ్రీ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? తన పెళ్లి కోసం ఎన్నో కలలు కంటున్న తన తల్లి(ఆమని) కోసం శ్రీ మరో పెళ్లి చేసుకున్నాడా? లేక సింధు కోసం అలాగే ఎదురుచూస్తూ ఉండిపోయాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్ :
'ప్యార్ ప్రేమ కాదల్'లోని కథాకథనాలు, పాత్రల్లో పెద్దగా మార్పులు చేయకుండానే 'ఊర్వశివో రాక్షసివో'ని రూపొందించారు. సాఫ్ట్ గా, పద్ధతిగా ఉండే అబ్బాయి.. పాష్ గా, బోల్డ్ గా ఉండే అమ్మాయిని ఇష్టపడే ఇలాంటి 'ముద్దపప్పు ఆవకాయ' కథలు ఇప్పటికే మనం ఎన్నో చూసి ఉన్నాం. అయితే కథాకథనాల్లో కొత్తదనం లేనప్పటికీ సన్నివేశాల్లో ఉన్న హాస్యం కారణంగా బోర్ కొట్టకుండా సినిమా అలా సరదాగా సాగిపోయింది.
ఈ సినిమా రెండేళ్ల ముందు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ అలరించేదేమో. నిజానికి ఈ చిత్రాన్ని 'ప్రేమ కాదంట' పేరుతో ఎప్పుడో ప్రకటించారు కానీ ఏవో కారణాల వల్ల ఆలస్యమైంది. లాక్ డౌన్ దెబ్బకి ఓటీటీలకు అలవాటుపడిపోయిన ప్రేక్షకులు ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ కోసం ప్రత్యేకంగా థియేటర్స్ కి రావడం తగ్గించారు. లేదంటే ముందొస్తే ఈ సినిమా యూత్ ని బాగానే ఆకట్టుకునేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతోకొంత కామెడీ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అదే సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఈ చిత్రంలో హాస్యం ఎంత ఆకట్టుకుంటుందో, హీరో పాత్ర తాలూకు సంఘర్షణ కూడా అంతే మెప్పిస్తుంది. ఓ వైపు ప్రేమించిన అమ్మాయేమో పెళ్లి వద్దు అంటుంది, మరో వైపు హీరో తల్లేమో అనారోగ్యంపాలై కొడుకు పెళ్లి గురించే కలలు కంటుంది. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, తల్లి కోసం వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోలేక హీరో పడే వేదన హత్తుకుంటుంది. అయితే కొన్నిచోట్ల అవే అవే సన్నివేశాలు రిపీట్ అయ్యి సినిమా గాడితప్పినట్టుగా అనిపించి, కాస్త అసహనం కూడా కలుగుతుంది. ఫస్టాఫ్ అంతా కామెడీతో సరదాగా సాగిపోయింది. సెకండాఫ్ లో కూడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఐపీఎల్ తెలుగు క్రికెట్ కామెంటరీలా.. సినిమాలో హీరో పాత్ర పరిస్థితి గురించి సునీల్, వెన్నెల కిషోర్ చెప్పే కామెంటరీ సీన్ బాగుంది. అయితే సెకండాఫ్ లో ఫ్యామిలీ డ్రామా కారణంగా అక్కడక్కడా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఈ సినిమాకి అచు రాజమణి సంగీతం, తన్వీర్ సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచాయి. కథానుసారంగా వచ్చే పాటలు అలరించాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. శిరీష్, అను మధ్య వచ్చే సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక తన్వీర్ సినిమాటోగ్రఫీ కూడా కలర్ ఫుల్ గా సన్నివేశాల మూడ్ కి తగ్గట్టు ఉంది. కార్తీక్ శ్రీనివాస్ కూర్పు బాగుంది కానీ సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసుంటే ల్యాగ్ లేకుండా ఉండేది. మొత్తానికి ఒరిజినల్ ఫిల్మ్ ని చెడగొట్టకుండా ఒక చెప్పుకోదగ్గ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని అందించాడు దర్శకుడు రాకేష్ శశి. అలాగే సంభాషణలు కూడా మెప్పించాయి. ముఖ్యంగా కామెడీ డైలాగ్స్ బాగా పేలాయి.
నటీనటుల పనితీరు:-
ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమాయకమైన కుర్రాడు శ్రీకుమార్ పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. అయితే ఎమోషన్ సన్నివేశాల్లో ఇంకాస్త మెరుగుపడాలి. తన పర్సనాలిటీకి, బాడీ ల్యాంగ్వేజ్ కి ఇలాంటి ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్స్ సరిగ్గా పోయేలా ఉన్నాయి. అను ఇమ్మాన్యుయేల్ తో శిరీష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అక్కట్టుకున్నాయి. ఫారెన్ కల్చర్ కి అలవాటు పడిపోయి.. జీవితంలో ప్రేమ, పెళ్లి కంటే గోల్ ముఖ్యం అనుకునే సింధూజ పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ చక్కగా ఒదిగిపోయింది. ఆమె పాత్రలో బోల్డ్ నెస్ తో పాటు పెయిన్ కూడా ఉంటుంది. ఇక పేరుకి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయినా ఓటీటీలో విపరీతంగా వెబ్ సిరీస్ లు చూసే అలవాటున్న సతీష్ పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించాడు. సునీల్ కూడా చాలా రోజుల తర్వాత తనదైన కామెడీతో బాగానే నవ్వించాడు. ఆమని, కేదార్ శంకర్, పృథ్వి, పోసాని కృష్ణ మురళి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
తెలుగుఒన్ పర్స్పెక్టివ్:
కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినప్పటికీ సన్నివేశాల్లోని కామెడీ బాగానే వర్కౌట్ అయింది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ముఖ్యంగా యూత్ ని మెప్పించే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
-గంగసాని