కోట శ్రీనివాసరావు-బాబు మోహన్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్!
on Jul 12, 2025
తెలుగు సినిమాలకు సంబంధించి కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది చాలా తక్కువ. అవి ఎవర్‌గ్రీన్‌గా ఉంటాయి. కామెడీ పాత్రల విషయానికి వస్తే.. పాత రోజుల్లో రేలంగి, రమణారెడ్డి కాంబినేషన్, ఆ తర్వాత రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. ఆ తర్వాతి రోజుల్లో అలాంటి గొప్ప కాంబినేషన్‌గా కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ జంట నిలిచింది. వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించారంటే నవ్వులే నవ్వులు. ఒక దశలో వీరిద్దరూ లేని సినిమా ఉండేది కాదు. అంతగా పాపులర్ అయ్యారిద్దరూ.
కోట శ్రీనివాసరావు కామెడీతోపాటు విలనీ కూడా అద్భుతంగా పోషించగలరు. అందులోనే విలనీ కామెడీతో కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించారు. ఆయనకు బాబూమోహన్ తోడవడంతో ఆ కాంబినేషన్‌కి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. వీరిద్దరూ కలిసి 60కి పైగా సినిమాల్లో నటించారు. వాటిలో ఎక్కువ శాతం సూపర్‌హిట్ సినిమాలే వుండడం విశేషం. వీరి కాంబినేషన్ అంతగా జనంలోకి వెళ్ళడానికి ముఖ్య కారణం వారి కామెడీ టైమింగ్. వీరిద్దరి కామెడీని ఎంజాయ్ చేసేందుకు ఆ సినిమాలకు రిపీట్ ఆడియన్స్ కూడా ఉండేవారు. కోట, బాబుమోహన్ కలిసి నటించిన తొలి సినిమా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలిరాజా’. ఇక అప్పటి నుంచి ఈ కాంబినేషన్‌కి తిరుగులేదు అనిపించేలా పోటీపడి మరీ నటించారు. మామగారు, చినరాయుడు, సీతారత్నంగారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో ఈ జంట చేసిన కామెడీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది. వీరి తర్వాత మళ్ళీ అలా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కాంబినేషన్ మరొకటి రాలేదనే చెప్పాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
