ENGLISH | TELUGU  

చిత్ర పరిశ్రమకు షాక్‌.. కోట శ్రీనివాసరావు ఇకలేరు

on Jul 12, 2025

టాలీవుడ్‌లో కామెడీ విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా అనేక పాత్రలు పోషించి ప్రేక్షకులు మెచ్చిన నటుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట.. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మరణవార్త.. ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. నటుడుగానే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన కోట శ్రీనివాసరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ షాక్‌కి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు. 

నవరసాలూ పోషించగల నటులు చిత్ర పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. పాతతరం నుంచి ఇప్పటివరకు అలాంటి కొందరు తమ నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. 1980వ దశకంలో అలాంటి ఓ నటుడు పరిచయమయ్యారు. అతనే కోట శ్రీనివాసరావు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి చాలా తక్కువ సమయంలోనే ప్రముఖ నటుడిగా ఎదిగారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించి చాలా ఆలస్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన కోట శ్రీనివాసరావు నేపథ్యం ఏమిటి, సినిమా రంగానికి ఎలా వచ్చారు, ఆయన పోషించిన పాత్రల ద్వారా ఎలాంటి పేరు తెచ్చుకున్నారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఈయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో పేరొందిన డాక్టర్‌. తండ్రిలాగే తను కూడా డాక్టర్‌ అవ్వాలని చిన్నతనంలో అనుకున్నారు కోట. కానీ, నాటకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల నటనవైపే మొగ్గు చూపారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూనే తరచూ నాటకాలు వేసేవారు. ఆ సమయంలో సినిమా రంగానికి రావాలన్న ఆలోచన ఆయనకు లేదు. 1977లో కోట, అతని మిత్రులు కలిసి ‘ప్రాణం ఖరీదు’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. నిర్మాత క్రాంతికుమార్‌కి ఆ నాటకం బాగా నచ్చింది. దాన్ని సినిమాగా తియ్యాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాటకంలో నటించిన వారందర్నీ తన సినిమా కోసం తీసుకొని ‘ప్రాణం ఖరీదు’ పేరుతోనే ఆ చిత్రాన్ని నిర్మించారు క్రాంతికుమార్‌. అలా ఆ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోట. ఈ సినిమా ద్వారానే మెగాస్టార్‌ చిరంజీవి నటుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో కోట చాలా చిన్న క్యారెక్టర్‌ చేశారు. ఆ తర్వాత అమరజీవి, బాబాయ్‌ అబ్బాయ్‌ చిత్రాల్లో కూడా నటించారు. అయితే ఆ సినిమాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకురాలేదు. 

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘మీరైతే ఏం చేస్తారు?’ అనే నాటకాన్ని ప్రదర్శించారు కోట బృందం. ఆ నాటకాన్ని దర్శకుడు టి.కృష్ణ చూశారు. అందులో కోట నటన ఆయనకు బాగా నచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత తను రూపొందిస్తున్న ‘వందేమాతరం’ చిత్రం కోసం కోటను కాంటాక్ట్‌ చేసి ఆయనకు ఒక మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. అది ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. అదే సంవత్సరం టి.కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన ‘ప్రతిఘటన’ చిత్రంలో చేసిన కాశయ్య పాత్ర కోట నట జీవితాన్నే మార్చేసింది. ఒక్కసారిగా ఆయన ఇమేజ్‌ను పెంచేసింది. దాంతో వరసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీ అయిపోయారు. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్ళంట’ చిత్రం కోటకు మరింత పేరు తెచ్చింది. ఈ సినిమా తర్వాత కామెడీ విలన్‌గా కూడా తన సత్తా చూపించారు. ఎంతలా అంటే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు ఉండడం వల్లే హిట్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తెలుగులోనే కాదు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే తమిళ్‌ నుంచి తెలుగులోకి డబ్‌ అయిన కొన్ని సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. తెలుగులో ఆయన నటించిన సినిమాల్లో చిత్రం భళారే విచిత్రం, ఆమె, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్‌, ఆ నలుగురు.. ఇలా చెప్పుకోదగిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇవివి సత్యనారాయణ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో కమెడియన్‌గా మంచి పాత్రలు పోషించారు కోట. తన నటనకుగాను 9 సార్లు ఉత్తమ విలన్‌గా, కమెడియన్‌గా, సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య పురస్కారం కూడా కోటను వరించింది. 

వ్యక్తిగత జీవితానికి వస్తే.. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లోనూ చరుకుగా పాల్గొన్న కోట శ్రీనివాసరావు.. 1999లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1966లో కోట వివాహం రుక్మిణితో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు కోట ప్రసాద్‌ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావు కూడా నటుడే. ఎన్నో సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించారు. 45 సంవత్సరాల తన సినిమా కెరీర్‌లో 750కి పైగా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు కోట శ్రీనివాసరావు. ఆయన నటించిన చివరి సినిమా 2023లో వచ్చిన సువర్ణ సుందరి. అనారోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.