English | Telugu
ఇది తప్పుడు కేసని పక్కా ఆధారాలతో నిరూపిస్తా!
Updated : Apr 30, 2021
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారని.. త్వరలోనే నిజానిజాలతో అందరి ముందుకు వస్తానని.. బుల్లితెర నటుడు, యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి తెలిపారు. ఓ మహిళను మోసం చేయడమే కాకుండా.. లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో రెండు రోజుల క్రితం నరసింహారెడ్డిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. తనపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చినప్పటికీ.. తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
భార్య శ్యామల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన వీడియోలో దేవుడి దయవల్ల ఇంటికి తిరిగి వచ్చానని.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తన గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజానిజాలను పంచుకోవడానికి కొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తానని అన్నారు. అసలు కేసు ఏంటి..? అందులో నిజాలేంటి ఇలా అన్ని రకాల ఆధారాలతో మిమ్మల్ని కలుస్తానని అన్నారు. అప్పుడు జనాలకే ఓ అంచనా వస్తుందని.. న్యాయం, న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదొక తప్పుడు కేసు అనడానికి పక్కా ఆధారాలతో నిరూపిస్తానని చెప్పారు. కొన్నిసార్లు ఇలాంటి నిందలు పడాల్సి ఉంటుందని.. కానీ వచ్చిన రూమర్లపై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని నరసింహారెడ్డి అన్నారు.
గండిపేట ఏరియాలో పబ్, గేమ్ జోన్ లాంటివి అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదిస్తూ.. నరసింహారెడ్డి తన వద్ద నుండి కోటి రూపాయల వరకు నగదు తీసుకున్నాడని సింధూరారెడ్డి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తీసుకున్న డబ్బు తిరిగివ్వమని అడిగితే తనపై దాడికి దిగినట్లు ఆమె ఆరోపించడంతో నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు బెయిల్ పై బయటకి వచ్చిన అతడు.. ఇదంతా తప్పుడు కేసు అని, ఆధారాలతో నిరూపిస్తానని అంటున్నాడు.